తెలంగాణ గ్రూప్‌-2 నియమకాలపై హైకోర్టు స్టే

November 20, 2019
img

గ్రూప్‌-2 నియమకాలపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా టీఎస్‌పీఎస్సీ మళ్ళీ పాత అభ్యర్ధులనే ఖరారు చేసి వారి ప్రొవిజినల్ జాబితాను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గ్రూప్-2 పరీక్షలలో ఉత్తీర్ణులైనప్పటికీ ఉద్యోగాలు దక్కని అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై బుదవారం విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నియామకాలు చేపట్టరాదని, ప్రొవిజినల్ జాబితాపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. 

గ్రూప్-2 పరీక్షలలో కొందరు అభ్యర్ధులు పరీక్షాపత్రాలపై నిబందనలకు విరుద్దంగా ‘వైట్నర్’ ఉపయోగించడం వంటివి చేసి జవాబులను మార్చారు. వారిలో చాలా మంది ఉద్యోగాలకు అర్హత సాధించడంతో ఈ వివాదం మొదలైంది. అవే పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయినవారు హైకోర్టును ఆశ్రయించగా, పరీక్షా పత్రాలలో అటువంటి దిద్దుబాట్లు ఉన్న సమాధానాలను పరిగణలోకి తీసుకోకుండా మిగిలిన సమాధానాలకు లెక్కగట్టి ఫలితాలు లెక్కగట్టి, 1:2 నిష్పత్తిలో నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 

కానీ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా గతంలో ఎంపికచేసిన వారి పేర్లనే టీఎస్‌పీఎస్సీ మళ్ళీ ప్రకటించడంతో మిగిలిన అభ్యర్ధులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో నియామకాలపై స్టే విధించింది. 

పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినప్పుడు ఎవరో ఒకరు వాటిని ఎత్తి చూపకమునుపే టీఎస్‌పీఎస్సీ వాటిని సరిదిద్దుకొని నిబందనల ప్రకారం ముందుకు సాగి ఉండి ఉంటే ఇటువంటి సమస్యలు, న్యాయవివాదాలు ఏర్పడి ఉండేవి కావు. కానీ కారణాలు ఏవైతేనేమీ సంబంధిత అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వలన టీఎస్‌పీఎస్సీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ న్యాయవివాదాల వలన ఉద్యోగాలు లభించకపోవడంతో పోటీ పరీక్షలకు కష్టపడి చదివి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు.

Related Post