నిరుద్యోగ భృతి ఊసే లేదేమిటో?

November 07, 2019
img

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులందరికీ నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ నిరుద్యోగులను బాగా ఆకట్టుకొంటుంది కనుక తెరాస కూడా పోటీగా నిరుద్యోగ భృతి హామీ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.3,016 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 

ప్రజలు మళ్ళీ తెరాసకే ఓట్లు వేసి గెలిపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది. కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. ఇంకా ఎప్పుడు ఇస్తుందో...అసలు ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఊదరగొట్టిన తెరాస నేతలు ఎవరూ ఇప్పుడు ఆ ప్రస్తావన చేయడానికి కూడా ఇష్టపడటంలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో కొందరు మంత్రులయ్యారు. మిగిలిన రాజకీయ నిరుద్యోగులు వరుసగా కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు. కానీ నేటికీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకలు నడుస్తోంది. మరోపక్క ఉద్యోగాలకు ఎంపికైన వారికి అనేక కారణాల చేత నియామకపత్రాలు, పోస్టింగులు ఆలస్యం అవుతుండటంతో వారూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. 

ప్రైవేట్ రంగంలో అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నప్పటికీ నిరుద్యోగుల సంఖ్య అంతకు పదిరెట్లు ఉండటంతో నేటికీ అనేకమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు లభించకపోవడంతో రాష్ట్రంలో నానాటికీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఉద్యోగం చేసి తల్లితండ్రులను, కుటుంబాన్ని చూసుకోవలసిన తరుణంలో ఉద్యోగాల దరఖాస్తుల కోసం, రోజువారీ ఖర్చుల కోసం ఇంకా తల్లితండ్రులపైనే ఆధారపడవలసివస్తుండటంతో నిరుద్యోగయువత ఆత్మన్యూనతతో బాధపడుతూ బరువుగా కాలం వెళ్ళదీస్తున్నారు. కనుక ఇకనైనా తెరాస సర్కార్ వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని నిరుద్యోగ భృతి చెల్లించడం మొదలుపెడితే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Related Post