జీతాలు ఇవ్వండి మహాప్రభో!

August 23, 2019
img

రాష్ట్రంలో సుమారు 15,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. వారందరికీ గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో అల్లాడిపోతున్నారు. నెలకు రూ.12,000 జీతంతో కుటుంబాని పోషించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అది కూడా 5 నెలలుగా అందకపోతే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొంతమంది ఒంటి మీదున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్ముకునో తాకట్టు పెట్టో అప్పులు తెచ్చుకోగా మరికొందరు రూ.3-10 వడ్డీలకు అప్పులు తెచ్చుకొని భారంగా బ్రతుకుబండి నడిపిస్తున్నారు. ఇక పిల్లల స్కూలు ఫీజులు వగైరాల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది.

జీతాలు అందినా అందకపోయినా తప్పనిసరిగా డ్యూటీలకు వెళ్ళాలి కనుక బస్సులు, ఆటోలకు అయ్యే ప్రయాణపు ఖర్చుల కోసం రోజూ చెయ్యి చాచాక తప్పడం లేదు. తమ కష్టాలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక విద్యా వాలంటీర్లు నానాబాధలు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదని, ఇంకా ఎప్పుడు చెల్లిస్తారని వారు ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తున్నారు. ఉపాద్యాయులతో సమానంగా పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే తమ జీతాలు చెల్లించాలని అధికారులకు మొరపెట్టుకొంటున్నారు. మరి ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందో లేదో?

Related Post