పార్టీ కార్యాలయాలపై ఉన్న శ్రద్ద పాఠశాలలపై లేదేంటో?

August 08, 2019
img

ములుగు జిల్లాలో ఈరోజు ఘోరప్రమాదం తృటిలో తప్పిపోయింది. బారీగా కురుస్తున వర్షాలతో జిల్లాలోని వెంకటాపురం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల భవనం పైకప్పు గురువారం ఉదయం కూలిపోయింది. అప్పటికి పాఠశాల తరగతులు ఇంకా మొదలవలేదు కనుక దానిలో చదువుకొంటున్న 46 మంది విద్యార్దులు, ఉపాద్యాయులు బ్రతికిపోయారు లేకుంటే పెనువిషాదం సంభవించి ఉండేది.

రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు, తరగతి గదులు కట్టించడానికి, మౌలికవసతులు కల్పించడానికి ఏటా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతుంటుంది. కానీ ములుగులో కూలిపోయిన ఈ పాఠశాల దశాబ్ధాల క్రితం నిర్మించినది కావడం విశేషం. అది శిధిలావస్థకు చేరుకుందని పాఠశాల అధ్యాపకులు, హెడ్ మాస్టర్ తమపై అధికారులకు చాలా కాలం క్రితమే తెలియజేశారు కానీ ఇంతవరకు కొత్త భవనం ఎందుకు నిర్మించలేదో తెలియదు.

కారణాలు ఏవైతేనేమీ నేడు ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగలేదు. తెరాస పార్టీ కార్యాలయాలు, కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, మండలి భవనాలు, ఎమ్మెల్యేలకు విలాసవంతమైన క్వార్టర్లు, చివరికి కులాలవారీగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి ఉత్సాహం ప్రదర్శించే ప్రభుత్వం, చిన్నారులు చదువుకొంటున్న పాఠశాల భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతోందో అర్ధం కాదు. అదే...పాఠశాలలో విద్యార్దులు ఉన్నప్పుడు ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉంటే ఏమి జరిగేది? దానికి ఎవరు బాధ్యతవహిస్తారు? కనుక పార్టీ కార్యాలయాలు నిర్మించడంలో తెరాస సర్కార్ చూపుతున్న చొరవ, ఉత్సాహం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై చూపిస్తే అందరూ హర్షిస్తారు. 

Related Post