దానిలో ఏదో మతలబు ఉంది: జగదీష్ రెడ్డి

July 31, 2019
img

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నూతన విద్యావిధానంపై ఈరోజు డిల్లీలో సమావేశం జరుగనుంది. దానిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుపవలసి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వాలను లోతుగా అధ్యయనం చేయనీయకుండా హడావుడిగా అమలుచేయాలనుకోవడంపై రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్వర్యంలో మంగళవారం జరిగిన వర్క్ షాప్‌లో పాల్గొన్న జగదీష్ రెడ్డి దానిలో పాల్గొన విద్యావేత్తలను, ఎన్‌జీవోలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం విద్యావ్యవస్థలో కొత్త విధానాన్ని అమలుచేయాలనుకోవడం మంచిదే కానీ అదో పంపించిన ముసాయిదాలో అనేక అంశాలపై స్పష్టత లేదు. ముసాయిదాలో రూపొందించిన తీరు చూస్తుంటే కేంద్రప్రభుత్వం కొన్ని విషయాలలో గోప్యతా పాటించదలచుకొన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల పరిధిలో ఉండవలసిన విద్యావ్యవస్థను కేంద్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసి మన అభిప్రాయాలూ తెలియజేయడానికి మరొక నెలరోజులు సమయం కోరాలని నిర్ణయించుకున్నాము,” అని అన్నారు. 

ఈ వర్క్ షాపులో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, విద్యాశాఖ కామేషనర్ నవీన్ మిత్తల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, పాఠశాల విద్యాకమీషనర్ విజయ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పలువురు విద్యావేత్తలు, ఎన్జీవోలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Related Post