ప్రభుత్వ పాఠశాలలకు విరాళాలు ఇవ్వాలనుకొంటున్నారా?

July 31, 2019
img

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఇంకా అనేక పాఠశాలలో నేటికీ కనీస సౌకర్యాలు లేక విద్యార్దులు, ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందిపడుతున్నారు. కొన్ని పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించవలసి ఉంది. విద్యార్దులు పరిశుద్దమైన త్రాగునీరు, టాయిలెట్లు, బెంచీలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. నేటికీ అనేక మంది నిరుపేద విద్యార్దులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండానే మైళ్ళ కొద్దీ నడుచుకొంటూ వస్తుండటం బహుశః అందరూ చూసే ఉంటారు.

నిత్యం ఇన్ని సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూనే వారు చదువులలో రాణిస్తున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే నిరుపేద విద్యార్దుకు విద్యకు నోచుకోలేరు. వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఆదుకోవలసిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉంది.


అయితే వాటికి ఏవిధంగా ఆర్ధికసహాయం అందించాలో తెలియక చాలామంది మిన్నకుండిపోతున్నారు. అటువంటివారి కోసమే రాష్ట్ర విద్యాశాఖ www.csredu.telangana.gov.in  అనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం దానిని ప్రారంభించారు. దానిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలు ఉంటాయి. వాటిలో మనం విరాళం ఇవ్వాలనుకొన్న పాఠశాలను ఎంపిక చేసుకొని నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా విరాళం ఈయవచ్చు. నిరుపేద విద్యార్దుల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక,వాణిజ్య సంస్థలు, ఎన్ఆర్ఐలు అందరూ ఉదారంగా విరాళాలు అందజేయాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. 



Related Post