ఏపీలో 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

July 27, 2019
img

ఉద్యోగాల నోటిఫికేషన్‌, భర్తీ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కంటే రెండు నెలల క్రితం కొత్తగాఅధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం దూసుకుపోతోంది. జగన్ ప్రకటించిన నవరత్నాలలో ఒకటి అయిన గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్తగా  ఏర్పాటు చేయబోతున్న 11,114 గ్రామ సచివాలయాలలోని 13 విభాగాలలో 95,088 ఉద్యోగాలు, 3,786 వార్డు సచివాలయాలలో 9 విభాగాలలో 33,501 ఉద్యోగాలు కలిపి మొత్తం 1,28,589 ఉద్యోగుల నియమకాలకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిలో గ్రామ సచివాలయంలో పనిచేయబోయే పంచాయతీ కార్యదర్శి మొదలు, ప్రతీ గ్రామానికి ఒక మహిళా పోలీసు, ఒక ఇంజనీరింగ్ సహాయకుడు, గ్రామ సర్వేయరు, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ మరియు విద్యా అసిస్టెంట్ వంటి కొత్త పోస్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించబోతోంది. 

ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా జిల్లా స్థాయిలోనే జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఎంపికైన ఉద్యోగులు అందరూ అక్టోబర్ 2వ తేదీ నుంచి విధులలో చేరుతారని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు కనుక సెప్టెంబర్ నెలాఖరులోగానే 1,28,589 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికాబోతోంది. 

ఎంపికైన ఉద్యోగులకు మొదట 2 సం.లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దానిలో నెలకు రూ.15,000 జీతం చెల్లించబడుతుంది. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తరువాత వారందరినీ శాస్విత ప్రాతిపదికన ఉద్యోగాలు ఖాయం చేసి, వారివారి గ్రేడ్స్ ప్రకారం పే-స్కేలు అమలుచేస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కోసం www.gramasachivalayam.ap.gov.in లేదా www.vsws.ap.gov.in లేదా www.wardsachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.    


Related Post