టీఆర్‌టీ అభ్యర్ధులకు శుభవార్త

July 06, 2019
img

టీఆర్‌టీ అభ్యర్ధులకు శుభవార్త. టీఆర్‌టీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులందరూ ఈనెలాఖరులోపుగానే నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్‌టీ పరీక్షలలో ఉత్తీర్ణులైన 7,414 మంది గత కొన్ని నెలలుగా నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కానీ వరుస ఎన్నికలు, న్యాయవివాదాల కారణంగా నియామకప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో చేతి వరకు వచ్చిన ప్రభుత్వోద్యోగాలు ఎక్కడ చేజారి పోతాయోనని వారు తీవ్ర ఆందోళన చెందుతూ భారంగా కాలం గడుపుతున్నారు.

బీటెక్, బీఎడ్ అర్హతలతో టీఆర్‌టీలో అర్హత సాధించినవారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల హైకోర్టు తీర్పు  చెప్పడంతో వారు కూడా ఈ ఉద్యోగాల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చివరికి ఇన్నాళ్ల ఎదురుచూపుల తరువాత వారి ఆశలు, కలలు ఫలించబోతున్నాయి. అర్హత సాధించిన వారందరికీ ఈనెలాఖరులోగా నియామక పత్రాలు పంపించబోతున్నామని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి చెప్పారు. టీఆర్‌టీ ఉద్యోగాలకు అర్హత సాధించినవారందరికీ మైతెలంగాణ.కామ్ ముందుగానే అభినందనలు తెలుపుతోంది.

Related Post