బీటెక్+బీఎడ్ అభ్యర్ధులకు శుభవార్త

July 05, 2019
img

బీటెక్+బీఎడ్ అభ్యర్ధులకు ఒక శుభవార్త. ఇక నుంచి వారు కూడా ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టిజిటి) పోస్టులకు అర్హులేనాని హైకోర్టు తీర్పు చెప్పింది. 

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) నిబందనల ప్రకారం టిజిటి పోస్టులకు బీఏ లేదా బీకామ్ లేదా బీఎస్సీ డిగ్రీ చేసిన తరువాత బీఎడ్ చేసి ఉండాలి. కానీ కొంతమంది బీటెక్ చేసిన తరువాత సరైన ఉద్యోగాలు రాకపోవడం చేతనో, వేరే ఇతర కారణాల చేతనో బీఎడ్ చేసి టిజిటి ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటారు. 

కానీ సాధారణ డిగ్రీ కాక బీటెక్ చేసినవారిని విద్యాశాఖ అనర్హులుగా పరిగణిస్తోంది. టిజిటి పరీక్షలలో ఉత్తీర్ణులైనప్పటికీ ఈ నిబందన కారణంగా ఉద్యోగావకాశం కోల్పోయిన కొండగర్ల సంజీవరావు, మరో ఇద్దరు అభ్యర్ధులు దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వాటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి వారి వాదనలతో ఏకీభవిస్తూ, బీటెక్ తరువాత బీఎడ్ చేసిన అభ్యర్ధులను టిజిటి ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించాలని తీర్పు చెప్పారు. 

ఎన్సీటీఈ నిబందనలలో బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ లేదా ‘ఏదైనా గ్రాడ్యుయేషన్’ చేసి ఉండాలి అని ఉండగా, టిజిటి నోటిఫికేషన్‌లో ‘ఏదైనా గ్రాడ్యుయేషన్’ అనే పదం లేకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కనుక బీటెక్+బీఎడ్ చేసిన అభ్యర్ధులలో ఉద్యోగార్హత సాధించినవారిని కూడా పరిగణనలోకి తీసుకొని నాలుగు వారాలలో వారి నియామకాలకు సంబందించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Related Post