ఏపీలో ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ!

June 22, 2019
img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఒకేసారి 4, లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాటిలో 50 శాతం అంటే 2,00,000 ఉద్యోగాలు మహిళలకు కేటాయించింది. స్థానికులకు వారి గ్రామంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

 ఈ ఉద్యోగాలకు ఎటువంటి రిజర్వేషన్లు లేవు కనుక 18 నుంచి 35 సం.ల వయసులోపున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మారుమూల గ్రామాలలో వాలంటీర్లకు కనీస విద్యార్హత 10వ తరగతి, మిగిలిన గ్రామాలలో వాలంటీర్లకు ఇంటర్మీడియట్‌ పాస్ అయ్యుండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. గ్రామ వాలంటీర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం లభిస్తుంది. ఈ నెల 24 నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఈ ఉద్యోగాలకు http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు. 

జూలై 10 వరకు దరఖాస్తుల పరిశీలన, జూలై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూల ద్వారా గ్రామవాలంటీర్ల ఎంపిక జరుగుతుంది. ఆగస్ట్ 1వ తేదీన ఎంపికైన అభ్యర్ధుల జాబితా ప్రకటించబడుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే ప్రకటించినట్లుగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు విధులలో చేరుతారు.  

గ్రామ వాలంటీర్ల విధులు: ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ నియామకం జరుగుతుంది కనుక వారిలో ప్రభుత్వ పధకాలకు అర్హులైనవారికి అవి చేరేలా చేయడం. చేరకపోతే సమస్య ఎక్కడ ఉందో గుర్తించి త్వరలో ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి దానిని పరిష్కరించే వరకు కృషి చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ పధకాలకుయి అర్హులను గుర్తించడంలో అధికారులకు తోడ్పడటం. తమ పరిధిలో ఉండే 50 కుటుంబాల నుంచి ఏవైనా వినతిపత్రాలు అందినట్లయితే వాటిని పైఅధికారులకు అందజేసి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం. గ్రామాలలో రేషన్ దుకాణం నుంచి రేషన్ సరుకులు లబ్ధిదారుల ఇళ్లకు అందజేయడం. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సచివాలయ అధికారులు సిబ్బందితో కలిసి పనిచేయడం మొదలైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. 

నిరుద్యోగులు తమ అర్హతకు తగిన మంచి ఉద్యోగాలు సంపాదించుకొనేవరకు వారికి నిరుద్యోగ భృతి ఇచ్చి పోషించడం కంటే, ఈవిదంగా వారి సేవలను ఉపయోగించుకొని గౌరవ వేతనం చెల్లించడం చాలా మంచి ఆలోచన.

Related Post