జూ.డాక్టర్ల సమ్మె...విరమణ

June 20, 2019
img

ప్రభుత్వ భోదనాసుపత్రులలో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 58 నుంచి 65 ఏళ్ళకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. 

జూనియర్ డాక్టర్ల సమ్మెతో హైదరాబాద్‌ నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, ఎర్రగడ్డ, సుల్తాన్‌బజార్‌, సరోజినిదేవి, ఎంఎన్‌జే, పేట్ల బురుజు తదితర ప్రభుత్వాసుపత్రుల అవుట్ పేషెంట్ వైద్యసేవలు నిలిచిపోయాయి. దాంతో ఆసుపత్రులకు వచ్చిన నిరుపేదరోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. సమ్మె కారణంగా పలు ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోయాయి. ప్రసవాలకు ఆసుపత్రులలో చేరిన గర్భిణి స్త్రీలు, చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లలు, వృద్ధులు సమ్మె కారణంగా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలుగజేసుకొని వారి డిమాండ్ పై సిఎం కేసీఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చిన తరువాత సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించి విధులలో చేరారు. 

మన దేశంలో వైద్యకళాశాలలో ప్రవేశాలకు జరిగే నీట్ పరీక్షలలో ఉత్తీర్ణులవడం, ఆ తరువాత ఖరీదైన, చాలా క్లిష్టమైన వైద్యవిద్యను అభ్యసించడం ఎంత కష్టమో తెలిసిందే. వారు కేవలం నాలుగేళ్ళలోనే మానవ శరీర నిర్మాణం, అది పనిచేసే విధానం, రోగాలు, వైద్యవిధానాలు, చికిత్సలు, మందులు మొదలైన అనేకానేక అంశాల గురించి నేర్చుకోవలసి ఉంటుంది. మిగిలిన వృత్తి విద్యలలో శిక్షణ పూర్తయిన తరువాత బయటకు వెళ్ళి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కానీ వైద్యవృత్తిలో ఆ అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కనుక వైద్య విద్యార్ధులకు ప్రతీ రోజూ ఎంతో విలువైనదే. లక్షలమందితో పోటీ పడి వైద్య కళాశాలలో సీటు సంపాదించుకుని జూనియర్ డాక్టర్లుగా ఎదిగిన తరువాత, వారు అదంతా మరిచిపోయి ఏదో ఒక సాకుతో సమ్మెలు చేస్తూ అమూల్యమైన తమ సమయాన్ని వృధా చేసుకుంటూ, అటు ప్రభుత్వాసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుండటం చాలా శోచనీయం.

Related Post