ఓయూలో రెండు కొత్త ఆన్‌లైన్‌ పీజీ డిప్లమా కోర్సులు

June 12, 2019
img

ఉస్మానియా యూనివర్సిటీ రెండు కొత్త ఆన్‌లైన్‌ పీజీ డిప్లోమా కోర్సులను త్వరలో ప్రారంభించబోతోంది. సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ అనే రెండు ఆన్‌లైన్‌ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ అనుమతి మంజూరు చేసిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఎస్.రామచంద్రం తెలిపారు. దూరవిద్య ద్వారా అందించబోయే ఈ రెండు కోర్సులకు ఫీజులు, అర్హతలు, కోర్సు వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. 

గత కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యవహారాలు శరవేగంగా పెరిగిపోయాయి. దానితోపాటే వైరస్ అటాక్స్, హ్యాకింగ్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటర్నెట్ వినియోగదారులను, ఐ‌టి కంపెనీలను కలవరపెడుతున్న ఆ సమస్యలే ‘సైబర్ సేఫ్టీ & సెక్యూరిటీ’ రూపంలో సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుండటం విశేషం. అంటే కొత్తకొత్త రోగాలతో పాటు మందులు, వైద్యనిపుణులు పెరిగినట్లే ఈ కోర్సులు కూడా పుట్టుకొచ్చాయని చెప్పుకోవచ్చు. మున్ముందు ఇంటర్నెట్ వినియోగం ఇంకా పెరగడం ఎంత వాస్తవమో దానితో పాటు ఈ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరగడం ఖాయం. కనుక ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెడుతున్న ఈ ‘సైబర్ సెక్యూరిటీ’ కోర్సు యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. 

ఇక డాటా సైన్స్ కోర్సు విషయానికి వస్తే, ఒకప్పుడు వ్యాపార, వాణిజ్య, మార్కెటింగ్ సంస్థలు మాత్రమే తమ వ్యాపార అవసరాల కోసం వినియోగదారుల డాటాను తయారుచేసుకొని తదనుగుణంగా వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రచించుకొనేవి. కానీ ఇప్పుడు రాజకీయపార్టీలు, వాటి నేతలు కూడా ఎన్నికలలో తమ విజయావకాశాలను పెంచుకునేందుకు ఈ ‘డేటా అనలిస్టుల’ సేవలు పొందుతున్నారు. అలాగే నియోజకవర్గం స్థాయి నుంకి జాతీయ స్థాయి వరకు అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబందిత వ్యక్తులు, వనరులు, వినియోగం, ప్రయోజనాలకు సంబందించి డాటా సేకరణ, విశ్లేషణ అనివార్యంగా మారింది. ప్రకృతి విపత్తులు, వాతావరణంలో మార్పులు, విద్యా, వైద్య, విద్యుత్, రవాణా, రక్షణ... ఈవిధంగా దాదాపు ప్రతీ రంగంతోనూ ఈ డాటా సైన్స్ ముడిపడే ఉంటోందిప్పుడు. కనుక ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెడుతున్న ఈ కోర్సు కూడా యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పవచ్చు. 

Related Post