ఇంటర్ పరీక్షా పత్రాలు మాయం

June 06, 2019
img

ఇంటర్మీడియట్‌ ఫలితాలలో ఏర్పడిన గందరగోళం కారణంగా ఈసారి రాష్ట్రంలో 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవడం, 3.50 లక్షల మంది విద్యార్దులు పరీక్షా పత్రాలను రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ చేయవలసి రావడంతో ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రతిష్ట చాలా మసకబారింది. రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా మూడు రోజుల క్రితం వరంగల్‌లోని మిల్స్ కొలనీ పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన పరీక్షా పత్రాలు మాయం అయినట్లు నిన్న బయటపడింది. పోలీస్ స్టేషన్లో ఉంచిన పెట్టెలలో రెండు పెట్టెలు మాయం అయినట్లు గుర్తించారు.

నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రేపు నిర్వహించబోయే పరీక్షల కోసం అధికారులు ఫిబ్రవరి 23న మూడు సెట్ల ప్రశ్నాపత్రాలను 13 పెట్టెలలో పెట్టి మిల్స్ కోలనీ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. అక్కడే 10వ తరగతి ప్రశ్నా పత్రాలున్న పెట్టెలను కూడా భద్రపరచడంతో పొరపాటున వాటితో పాటు ఇంటర్ ప్రశ్నాపత్రాలున్న బాక్సులు కూడా తీసుకువెళ్లిపోయుండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. నిన్నటి నుంచి అధికారులు, పోలీసులు వాటి కోసం గాలిస్తున్నారు.

ఒకవేళ అవి దొరకకపోయినా లేదా అవి బయటకు లీక్ అయినా రేపు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా? తెలియవలసి ఉంది. మూడు సెట్లలో ఒకటి మాయం అయినప్పటికీ ఇంకా రెండు సెట్లు ఉన్నందున వాటిలో ఒకటి ఎంచుకొని పరీక్షలు నిర్వహించవచ్చు. కనుక దీనిపై ఇంటర్ బోర్డు ఈరోజు సాయంత్రంలోగా స్పష్టత నీయవలసి ఉంది. 

Related Post