ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా?

May 16, 2019
img

ఇంటర్ ఫలితాలలో జరిగిన పొరపాట్లకు 26 మంది విద్యార్దులు బలైపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక పొరపాటు వలన వరుసగా పరీక్షలు, ప్రవేశాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది విద్యార్దుల పరీక్షాపత్రాల రీ-కౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశాల కారణంగా ఈనెల 27వరకు ఫలితాలు వెల్లడించలేని పరిస్థితి నెలకొంది. 

ఆ కారణంగా ఈనెల 25 నుంచి జరుగవలసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా వాయిదా వేయకతప్పడం లేదు. వీలైతే మే 28 నుంచి లేదా జూన్ మొదటివారంలో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అందుకు అనుగుణంగా పరీక్షల షెడ్యూల్ నేడో రేపో మళ్ళీ ప్రకటించబోతోంది. 

ఇంటర్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవుతుండటంతో ‘దోస్త్’ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలలో డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నేటి వరకు వాయిదా వేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు మే 27వరకు ఇంటర్ ఫలితాలు వాయిదా పడ్డాయి కనుక నేటి నుంచి డిగ్రీ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందో లేదోనని ఇంటర్ పాస్ అయిన విద్యార్దులు ఆందోళన చెందుతుంటే, తమ ఫలితాలు వెల్లడికాకమునుపే డిగ్రీ ప్రవేశాల భర్తీ అయిపోతే తాము నష్టపోతామని రీ-కౌంటింగ్ జరుగుతున్న విద్యార్దులు ఆందోళన చెందుతున్నారు. 

ఇంటర్ ఫలితాల గందరగోళం ప్రభావం ఎంసెట్ ప్రవేశాలపై కూడా పడింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత ఎంసెట్ పరీక్షలు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఇంటర్ పూర్తిస్థాయి ఫలితాలు వెలువడక మునుపే ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 3,4,6 తేదీలలో ఇంజనీరింగ్, మే 8,9 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరిగాయి. 

మొదటిసారి ఇంటర్ ఫలితాలు ప్రకటించినప్పుడు పాస్ అయిన విద్యార్దులకు ఎంసెట్ పరీక్షలు వ్రాయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ నేటికీ ఫలితాలు తెలియని 3.28 లక్షల మంది విద్యార్దుల పరిస్థితే ఆగమ్యగోచరంగా మారింది. రీకౌంటింగులో తాము పాస్ అవుతామొ లేదో తెలియని స్థితి నెలకొన్న కారణంగా వారు ఒకపక్క మళ్ళీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు, మరోపక్క ఎంసెట్ పరీక్షలకు ఫీజులు చెల్లించి వ్రాయవలసివస్తోంది. 

ఎంసెట్ ప్రవేశ పరీక్షలు పూర్తయిపోయాయి కానీ ఇంతవరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం జరుగనే లేదు. ఇంకా ఎప్పుడు జరుగుతాయో తెలియని స్థితి నెలకొంది. ఈసారి ఇంటర్ బోర్డు పొరపాటుకు వరుసగా ఒకదాని తరువాత మరొకటిగా విద్యార్దులు ఇన్ని సమస్యలు ఎదుర్కోవలసివస్తోంది. ఇకనైనా ఇంటర్ బోర్డు లోపాలను సరిదిద్దుకొని ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటే మంచిది. 

Related Post