ఇంటర్ ఫలితాలు ఇంకా ఎప్పుడో?

May 10, 2019
img

కారణాలు, కారకులు ఏమైతేనేమి ఈసారి ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల వెల్లడిలో బోర్డు దారుణంగా విఫలమైంది. ఆ కారణంగా 26మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. పోయిన ప్రాణాలను ఇంటర్ బోర్డు అధికారులు ఎలాగూ తిరిగి తీసుకురాలేరు కనీసం ఈసారైనా ఫలితాలలో ఎటువంటి గందరగోళం లేకుండా వెలువరిస్తే చాలని విద్యార్దులు, వారి తల్లితండ్రులు కోరుకొంటున్నారు. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది విద్యార్దుల పరీక్షా పత్రాలను మళ్ళీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసి ఇవాళ్ళ (శుక్రవారం) ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ క్రిందటివారం ప్రకటించారు. కానీ ఈరోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, పాస్ అయిన విద్యార్దులు దరఖాస్తు చేసుకొన్న పేపర్ల పరిశీలన ఇంకా పూర్తవకపోవడం వలన ఫలితాలు వెల్లడిలో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. మే 15వ తేదీలోగా ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌లో పాస్ అవుతామని భావిస్తున్న విద్యార్దులు, ఇంటర్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవుతుండటంతో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలో లేదో తేల్చుకోలేకపోతున్నారు. కానీ చాలా మంది ముందు జాగ్రత్త చర్యగా ఫీజు కట్టి మళ్ళీ పరీక్షలకు సిద్దం అవుతున్నారు. ఇక ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్దులు కూడా ఇంటర్ బోర్డు నిర్వాకంతో చాలా ఆందోళన చెందుతున్నారు.

Related Post