మహబూబ్‌నగర్‌లో టిఆర్టీ అభ్యర్దులు విన్నూత్న నిరసన

May 09, 2019
img

టీచర్స్ రిక్రూట్మెంట్లకు 2017లో నోటిఫికేషన్లు విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేసినప్పటికీ ఇంతవరకు నియామకాలు చేపట్టకపోవడం విస్మయం కలిగిస్తుంది. రిక్రూట్మెంట్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్దులు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేకపోవడంతో, వారందరూ తమ సమస్యను  పరిష్కరించుకొనేందుకు నిరుద్యోగి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో టీఆర్‌టీ 2017 సెలెక్టెడ్‌ ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు  చేసుకొన్నారు. వారు తమ ఆవేదనను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు బుదవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళగా పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కు తిప్పి పంపించేశారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్స్ రిక్రూట్మెంట్లకు కౌన్స్లింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

తమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రభుత్వానికి తెలియజేసేందుకే భిక్షాటన చేశామని రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులుగా విద్యార్దులకు పాఠాలు చెప్పవలసిన గురువులు రోడ్లపై భిక్షాటన చేస్తుండటం సమాజానికే కాదు...ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీ గురించి తెరాస నేతలు చాలా గట్టిగానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తే మేము అధికారంలోకి వస్తే నెలకు రూ.3,016 ఇస్తామని తెరాస హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నోటిఫికేషన్లు లేవు...నియామకాలు లేవు... నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఏమంటే ‘ఎన్నికల కోడ్’ అని ఒకటే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెలలో పురపాలక ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల కోడ్ కొనసాగుతూనే ఉంటుంది కనుక అప్పటి వరకు నిరుద్యోగులు ఎదురుచూడక తప్పదేమో? కనీసం అప్పుడైనా తెరాస సర్కార్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేసి, నిరుద్యోగ భృతి ఇస్తుందో లేదో చూడాలి. ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస సర్కారు గతంలో అలసత్వం ప్రదర్శించినందుకే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చమటోడ్చవలసి వచ్చిందనే సంగతి మరిచిపోకూడదు.

Related Post