ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణకు కమిటీ ఏర్పాటు

April 22, 2019
img

ఇటీవల వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో అనేకమంది మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవడం, కొందరి మార్కుల జాబితాలలో మార్కులకు బదులు ఎఫ్, ఏపీ వంటి అక్షరాలు ముద్రించబడి ఉండటంతో విద్యార్దులు, వారి తల్లితండ్రులు, విద్యార్ది సంఘాలు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోజూ ధర్నాలు చేస్తున్నారు. 

ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత ఫెయిల్ అయిన కొందరు విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది. ఈసారి ఇంటర్ 1,2వ సం.కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్దులు పరీక్షలు వ్రాయగా వారిలో ఏకంగా 4 లక్షల మంది ఫెయిల్ అవడంతో విద్యార్దులు, తల్లితండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. 

ఈ సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన ఈ అవకతవకలపై విచారణ జరిపి మూడు  రోజులలోపుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్ పరీక్షా ఫలితాలలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్ది విద్యార్దులు నష్టపోకుండా చూస్తాము. కనుక విద్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పాస్ అవుతామని నమ్మకమున్న విద్యార్దులు తమ జవాబు పత్రాలను రీ-కౌటింగ్ జరిపించుకోవడానికి దరఖాస్తులు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాము,” అని చెప్పారు.           


Related Post