విద్యార్దులూ...తొందరపడొద్దు ప్లీజ్!

April 19, 2019
img

ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. తక్కువ మార్కులతో పాస్ అయిన ఒక విద్యార్ధి కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. 

పరీక్షలలో ఫెయిల్ అయితే ఇంట్లో తల్లితండ్రులు తిడతారనో లేదా బందుమిత్రులు నవ్వుతారనే భయంతోనో లేక ఫెయిల్ అయ్యమనే నిరాశతోనో విద్యార్దులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకొంటూ తల్లితండ్రులకు తీరనిశోకం మిగిల్చి వెళ్లిపోతున్నారు. 

చదువులు జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులు కేవలం లోకజ్ఞానం కోసం, ఉద్యోగాలు లేదా ఉపాధిమార్గాలకు తగిన అర్హత సాధించడం కోసమేనాని విద్యార్ధులు గ్రహించాలి. విద్యార్ధులపై స్కూళ్ళు, కాలేజీలలో చాలా ఒత్తిడి ఉంటున్నమాట వాస్తవమే. కానీ పరీక్షలవడంతోనే ఆ స్కూలు లేదా కాలేజీలతో శాస్వితంగా బందం తెగిపోతుందనే సంగతి విద్యార్ధులు గుర్తుంచుకోవాలి. కనుక అక్కడ చదువుతున్నంత కాలమే ఆ ఒత్తిడి ఉంటుంది తప్ప బయటకు వస్తే ఆ ఒత్తిడి ఉండదని గ్రహించాలి. 

అలాగే ఏ తల్లితండ్రులైనా తమ పిల్లలు మంచిమార్కులతో పాస్ అవుతూ పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని హాయిగా బ్రతకాలని కోరుకొంటుంటారు తప్ప పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవాలని కోరుకదా? అంటే పిల్లల భవిష్యత్ బాగుండాలనే తాపత్రయంతోనో లేదా కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగానో పిల్లలపై ఒత్తిడి చేస్తుంటారు. కనుక పరీక్షలలో ఫెయిల్ అయితే వారు తిడతారనే భయంతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు. 

అసలు పరీక్షలలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము? అని విద్యార్ధులు ఒకసారి ఆలోచిస్తే లోపం ఎక్కడుందో వారికే తెలుస్తుంది. ఆ లోపాన్ని గుర్తించగలిగితే దానిని అధిగమించడం కూడా సులువే. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్స్ అర్ధం కాకపోతే అధ్యాపకులు, తల్లితండ్రులు, స్నేహితులు ఎవరి ద్వారానైనా ఈ సమస్యను అధిగమించవచ్చు.    

ఏ కారణం చేతైనా ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి పాస్ అవొచ్చు లేదా ఐటిఐ పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా సంస్థలలో చేరి సాంకేతిక విద్యనభ్యసించవచ్చు. 

ఒకవేళ చదువులపై ఆసక్తి లేదనుకొంటే రకరకాల పనులు నేర్చుకొని ఉద్యోగం లేదా ఉపాది సంపాదించుకోవచ్చు. ఈరోజుల్లో చాలా గ్రామాలలో, పట్టణాలలో  10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు కూడా టైల్స్ వేయడం, ఫుడ్ ఐటెమ్స్ తయారుచేయడం, ప్లంబింగ్, పెయింటింగ్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, సెల్ ఫోన్, బైక్ రిపేరింగ్ వంటి ఏదో ఒక పని నేర్చుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. పైగా వారే మరో నలుగురికి జీతమిచ్చి పోషిస్తున్నారు కూడా. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో ఏ పని చేయడం వచ్చినా లేదా ఏ పనిచేసినా డబ్బు సంపాదించుకొనేందుకు అనేక మార్గాలున్నాయి. హాయిగా జీవించడానికి మన ముందు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు తొందరపడి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? చదువు బ్రతకడం కోసమే తప్ప చావడం కోసం కాదనే సంగతి విద్యార్దులు అందరూ గుర్తుంచుకోవాలి.

Related Post