రంగారెడ్డిలో 163 మంది టీచర్లకు నోటీసులు!

April 17, 2019
img

రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ 163 మంది ఇంగ్లీష్ టీచర్లను సంజాయిషీ కోరుతూ మంగళవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యంగా ఈనెల 15వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం ప్రారంభం అయ్యింది. దీని కోసం జిల్లాలో హయత్‌నగర్‌లోని వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 26వ తేదీ కల్లా ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ గడువు విదించింది. 11 రోజుల్లో 6 లక్షల పత్రాలను వారు దిద్దవలసి ఉంటుంది కనుక టీచర్లపై సహజంగానే తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. దీని కోసం మొత్తం 3,000 మంది టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కానీ మొదటిరోజునే వారిలో 163 మంది చెప్పా పెట్టకుండా డుమ్మా కొట్టారు. 

మొదటిరోజున ఇంగ్లీష్ పేపర్లు దిద్దవలసి ఉంది. కానీ ఒకేసారి అంతమంది టీచర్లు డుమ్మా కొట్టడంతో ఆశించిన స్థాయిలో మూల్యాంకనం జరుగలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి భాద్యతారాహిత్యంగా వ్యవహరించిన 163 మంది టీచర్లను ఎందుకు సస్పెండ్ చేయకూడదో 24 గంటలలోగా సమాధానం తెలుపాలంటూ నోటీసులు పంపించారు. వెంటనే స్పందించకపోతే చర్యలు తప్పవని నోటీసులలో హెచ్చరించారు. 

మూల్యాంకనం చేసే విషయంలో విద్యాశాఖకు, ఉపాద్యాయ సంఘాలకు భిన్నాభిప్రాయాలున్నాయి. తాము చేసిన కొన్ని సూచనలను, డిమాండ్లను, తమ సమస్యలను విద్యాశాఖ ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఉపాద్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ సమస్యను ఇరువర్గాలు శాంతియుతంగా పరిష్కరించుకోగలిగితే సకాలంలో 10 వతరగతి ఫలితాలు వెలువడుతాయి. కాదని పంతాలు, పట్టింపులకుపోతే ఫలితాలు ఆలస్యం అవుతాయి. అప్పుడు విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని మరిచిపోకూడదు.

Related Post