రైల్వేలో 4 లక్షల ఉద్యోగాలు: నిజమా...ఎన్నికల స్టంటా?

January 24, 2019
img

రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ రైల్వేలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన తాజా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “క్రిందటి సంవత్సరంలో 1.50 లక్షల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాము. వాటిలో ఉత్తీర్ణులైనవారు త్వరలో ఉద్యోగాలలో చేరబోతున్నారు. వాటిని భర్తీ చేయగా ఇంకా 1,32, 328 ఖాళీలున్నాయి. రాబోయే రెండేళ్ళలో రైల్వేలో సుమారు లక్షమంది రిటైర్ కాబోతున్నారు. వాటినీ మళ్ళీ వెంటనే భర్తీ చేయవలసి ఉంటుంది. కనుక రాబోయే రెండేళ్ళలో రైల్వేలో సుమారు 3,32,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము. వాటికి సంబందించి నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తాము. మార్చి 2019లో మొదటిదశలో1,32, 328 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతాము. వాటిలో షెడ్యూల్డ్ కులాలకు 19,715, షెడ్యూల్ తెగలకు 9857, వెనుకబడిన వర్గాలకు 35,485, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 13,100 పోస్టులు లభిస్తాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 2020, ఏప్రిల్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని గడువు విధించుకున్నాము,” అని చెప్పారు. 

రైల్వేశాఖ నిజంగా 1,32, 328 ఉద్యోగాల భర్తీకి పూనుకొంటే మంచిదే. కానీ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతను ప్రసన్నం చేసుకోవడానికే పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేసి ఉంటే ఆ తరువాత విమర్శల పాలవక తప్పదు. 

పీయూష్ గోయల్ ప్రకటనపై మాజీ ఆర్ధికమంత్రి పి చిండంబరం వెంటనే స్పందిస్తూ, “రైల్వేశాఖలో 2,82,976 ఖాళీలున్నాయి కానీ ఈ ఐదేళ్ళలో వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు హటాత్తుగా మేల్కొని మూడు నెలలో 1,32, 328 ఉద్యోగాల భర్తీ చేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడానికే. ప్రభుత్వంలో మిగిలినశాఖలలో కూడా ఇదే పరిస్థితులు నెలకొనున్నాయి. ఒకవైపు లక్షల ఖాళీలున్నాయి. మరోపక్క లక్షల మంది నిరుద్యోగులున్నారు,” అని ట్వీట్ చేశారు.

Related Post