తెలంగాణ పోలీసులకు శుభవార్త

January 11, 2019
img

తెలంగాణ పోలీసులకు శుభవార్త. త్వరలోనే వారికి కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు శలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వారిపై పని ఒత్తిడి తగ్గించేందుకుగాను షిఫ్ట్ డ్యూటీ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ రెండు విధానాలు అమలుచేయాలంటే అధనంగా పోలీసు సిబ్బంది అవసరం పడుతుంది. వారికి జీతభత్యాలు, తదితర సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది కనుక ప్రభుత్వంపై అధనపు ఆర్ధికభారం పడుతుంది. 

ఈ విధానాన్ని అమలుచేయడానికి అధనంగా ఇంకా ఎంతమంది పోలీసులను నియమించుకోవాలి? ఒక్కో పోలీస్ కమీషనరేట్ పరిధిలో అధనంగా ఎంతమందిని నియమించుకోవాలి? వంటి అంశాలపై జిల్లా పోలీస్ కమీషనర్లు, ఎస్పీల నుంచి వివరాలు సేకరిస్తోంది. వారు ఇచ్చే నివేదికలను బట్టి కొత్తగా పోలీస్ సిబ్బందిని నియమించుకోవడం వలన ప్రభుత్వం ఎంత అధనపు భారంపడుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా 10,000 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిలో పోలీసులు నియమితులయ్యారు. మరో 18,000 మంది భర్తీకి ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నూతన షిఫ్ట్ డ్యూటీ విధానం కోసం అధనంగా మరో 12,000 మంది అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఈ నూతన విధానం అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తునట్లు సమాచారం. కనుక ఆలోపుగానే అధనపు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కూడా ఉంది.

Related Post