జూనియర్ కార్యదర్శుల నియామకాలపై హైకోర్టు తాజా ఉత్తర్వులు

December 27, 2018
img

తెలంగాణ పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషనుపై మళ్ళీ నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు, రాత పరీక్షల నిర్వహణలో, నియామకాలలో జరిగిన అవకతవకలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రశ్నాపత్రాలలో దొర్లిన తప్పులను అభ్యర్ధులు టి.ఎస్.పి.ఎస్.సి. దృష్టికి తీసుకువచ్చినా వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని  ప్రభుత్వ న్యాయవాదిని గట్టిగా నిలదీసింది. నియామకాలపై  స్టే ఎత్తివేయాలనే ప్రభుత్వ న్యాయవాది అభ్యర్ధనను తిరస్కరించింది. వికలాంగుల కోటా, స్పొర్ట్స్ కోటాల ప్రకారం ఫలితాలను సవరించి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు అనుమతి లేనిదే ఎవరికీ ఉద్యోగ నియామకపత్రాలు ఇవ్వరాదని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి తెరాస అధికారం చేపట్టినప్పుడు అనుభవలేమి లేదా తొందరపాటు లేదా అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి హైకోర్టులో తరచూ మొట్టికాయలు పడుతుండేవి. కానీ నాలుగేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన తరువాత కూడా ఇంకా హైకోర్టులో ఈవిధంగా మొట్టికాయలు పడుతుండటం ఆశ్చర్యమే. రాజకీయ నిర్ణయాలకు తెరాస ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సహజం. కానీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్నా పొరపాట్లకు కూడా ప్రభుత్వమే అప్రదిష్టపాలవవలసి వస్తోంది. దీనికి అధికారుల తొందరపాటు, నిర్లక్ష్యం లేదా అలసత్వం కారణంగా కనిపిస్తోంది. 

గత నాలుగేళ్ళలో టి.ఎస్.పి.ఎస్.సి. వివిద ఉద్యోగాలకు అనేక పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉంది. కనుక పరీక్షల నిర్వహణలో... రిజర్వేషన్ల విషయంలో దానికి పూర్తి స్పష్టత ఉందనే అనుకోవచ్చు. అయినా ఇటువంటి తప్పులు దొర్లుతుండటం ఆశ్చర్యమే. టి.ఎస్.పి.ఎస్.సి. చేస్తున్న ఇటువంటి పొరపాట్ల వలన హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు వేయించుకోవలసి వస్తోంది. ఆ కారణంగా ప్రభుత్వానికి అప్రదిష్ట కలుగుతోంది. కనుక పరీక్షల నిర్వహణ మొదలు నియామకాల వరకు లోపరహితమైన విధానాలను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.

Related Post