కొత్త జోనల్ వ్యవస్థ వల్ల ప్రయోజనాలు ఏమిటంటే...

August 30, 2018
img

రాష్ట్రంలో అమలులోకి రాబోతున్న ఏడు కొత్త జోన్స్ రెండు మల్టీ జోన్స్ వలన అనేక ప్రయోయజనాలున్నాయి. ఇక నుంచి ప్రభుత్వోద్యోగాలలో 95 శాతం స్థానికులకే లభించబోతున్నాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి లోపు వరుసగా 4 సం.లు ఎక్కడ చదువుకొంటే ఆ ప్రాంతంలో స్థానికులుగా గుర్తిస్తారు.

జోనల్, మల్టీ జోనల్ కేటగిరీలలోకి వచ్చే మొత్తం 55 రకాల ప్రభుత్వోద్యోగాలు స్థానికులకే లభిస్తాయి. దీంతో ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియకున్న ప్రధాన అవరోధలన్నీ తొలగిపోతాయి కనుక బహుశః ఇకపై ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కావచ్చు కనుక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఇక నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల విధానం ఉండదు కనుక ఆ ఉద్యోగాలకు కూడా జిల్లా, జోనల్ స్థాయి అభ్యర్ధులు అర్హులవుతారు. అదేవిధంగా జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగుల వర్గీకరణకున్న అవరోధాలు తొలగిపోతాయి కనుక బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సరళతరం కానుంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విధానంలో అన్ని కేడర్లలో ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే లభించనున్నాయి. 

లోపభూయిష్టమైన పాత జోనల్ వ్యవస్థ స్థానంలో సరళతరమైన కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించడం ఒక ఎత్తు అయితే, ఒకపక్క ప్రతిపక్షాలు  విమర్శలు ఎదుర్కొంటూ మరోపక్క కేంద్రం వేసే కొర్రీలకు సంజాయిషీలు ఇస్తూ చివరికి దీని కోసం సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీని, రాజ్ నాథ్ సింగ్ ను కలిసి మాట్లాడి ఒప్పించి ఈ కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చేయడం చాలా గొప్ప విషయమే. ఇది సిఎం కేసీఆర్‌ కార్యసాధనకు మరో మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీని కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తూ పార్లమెంటు లోపల బయటా పోరాడిన  తెరాస ఎంపిలను, దీని కోసం డిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అలుపెరుగక తిరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను అభినందించక తప్పదు. ఈ క్రెడిట్ అంతా వారందరిదే. వారికి తెలంగాణ ప్రజల తరపున అభినందనలు తెలుపుతోంది మైతెలంగాణ.కాం. 

Related Post