గెస్ట్ లెక్చరర్ల భర్తీపై హైకోర్టు స్టే

August 09, 2018
img

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్ల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. జూలై 25న దీని కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషను సవాలు చేస్తూ ఖమ్మం, మరికొన్ని జిల్లాలలో జూనియర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న యాకూబ్ పాషా తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇప్పటికే గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న తమకు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. తమ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోవడం వలన ఈ తాత్కాలిక పోస్టులకోసం తాము కూడా కొత్తవారితో పోటీపడవలసి వస్తుందని వారు పిటిషనులో పేర్కొన్నారు. కనుక గెస్ట్ లెక్చరర్ల నియామకాలలో తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. 

వారి పిటిషనుపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, గెస్ట్ లెక్చరర్ల నియామకాలను రెండు వారాలపాటు నిలిపివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి, ఇంటర్మీడియేట్ కమీషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేశారు. 

గెస్ట్ లెక్చరర్ల నియామకాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలవుతున్నప్పుడు, ఇక శాశ్విత ప్రాతిపదికన ప్రభుత్వోద్యోగాలకు టి.ఎస్.పి.ఎస్.సి.జారీ చేసే నోటిఫికేషన్స్ పై ఎవరికీ అభ్యంతరాలు ఉండవని ఆశించలేము. ఇటువంటి న్యాయవివాదాల కారణం చేత కూడా ఉద్యోగాల భర్తీలో ఆలస్యం అవుతోంది. అందుకు ఎవరు కారకులైనప్పటికీ మధ్యలో నిరుద్యోగులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు ఈ కేసుల కారణంగా జరుగుతున్న జాప్యం వలన వాటికి దరఖాస్తు చేసుకొన్నా అర్హులైన నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతోంది. అప్పుడు వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అందుకు ఉదాహరణగా డిఎస్సి-1998 కేసును చెప్పుకోవచ్చు. కోర్టు కేసుల కారణంగా నేటికీ దానిలో అర్హులకు ఉద్యోగాలు లభించలేదు. వారిలో అనేకమందికి 40-50 సం.ల వయసు వచ్చేయడంతో వారు ఏ ఉద్యోగానికి పనికిరాకుండాపోయారు. కనుక ఉద్యోగాల భర్తీ విషయంలో కోర్టులకు వెళ్ళేముందు దాని పర్యవసానాలను ఆలోచించడం కూడా చాలా అవసరమే. 

Related Post