ఇంగ్లీషు అర్ధంకాలేదని ఆత్మహత్య

July 27, 2018
img

అవును. ఇంగ్లీషులో చెప్పే పాఠాలు అర్ధంచేసుకోలేక చదువులలో వెనకబడుతున్నందుకు మనస్తాపం చెంది ఒక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో నివసిస్తున్న అంజయ్య, అంజమ్మ దంపతుల ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (22). కోదాడలో చదువులు పూర్తిచేసుకొని కొంతకాలం తండ్రికి వ్యవసాయపనుల్లో సాయం చేశాడు. కానీ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే తపనతో హైదరాబాద్ చేరుకొని దోమల్ గూడలో తన స్నేహితులతో కలిసి ఒక రూము తీసుకొన్నాడు. పది రోజుల క్రితమే నగరంలో ఒక ప్రముఖ హోటల్ మేనేజిమెంటు కళాశాలలో చేరాడు.

అయితే హోటల్ మేనేజిమెంటు కళాశాలలో కేవలం ఇంగ్లీషులోనే పాఠాలు భోధిస్తుండటంతో మురళీకృష్ణ అర్ధం చేసుకోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. తన తోటి విద్యార్ధులు అందరూ వాటిని చక్కగా అర్ధం చేసుకొని చదువుకొంటుంటే తాను మాత్రం అర్ధం చేసుకోలేకపోతున్నానని రోజూ బాధపడేవాడు. స్నేహితులు అతనికి ధైర్యం చెప్పి సాయం చేస్తుండేవారు. కానీ తీవ్ర మనస్థాపం చెందిన మురళీకృష్ణ స్నేహితులు రూములో లేని సమయం చూసి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సూసైడ్ నోట్ లో తన మనసులో బాధను తెలియజేశాడు. అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇంగ్లీషు మాద్యమంలో పాఠాలు అర్ధం చేసుకోలేక చాలా మంది విద్యార్ధులు ఈవిధంగానే తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. కానీ వారందరూ మురళీకృష్ణలాగ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. వీలైతే ఇంగ్లీషు నేర్చుకొని ముందుకు సాగుతారు లేకుంటే చదువులు నిలిపేసి మరో రంగంలో ప్రవేశిస్తుంటారు. కనుక మురళీకృష్ణ కూడా అదే పని చేసి ఉండవచ్చు. కానీ ఒత్తిడి భరించలేక మనస్తాపంతో ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు. ఆ కారణంగా తనపైనే ఎన్నో ఆశలుపెట్టుకొని బ్రతుకుతున్న తల్లితండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చాడు.     

గ్రామీణప్రాంతాల నుంచి వచ్చినవారు ఇంగ్లీషు అర్ధం చేసుకోలేరు...ఉన్నత విద్యలు అభ్యసించలేరనే అపోహలను ఇది నిజం చేస్తున్నట్లుంది. కానీ జగిత్యాల జిల్లాలో మెట్ పల్లి నుంచి వచ్చిన దురిశెట్టి అనుదీప్ యావత్ దేశంలోనే సివిల్స్ టాపర్ గా నిలిచిన సంగతి గమనిస్తే పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని అర్ధం అవుతుంది. ఒకవేళ సాధ్యం కాదనుకొంటే ప్రాణాలు తీసుకోనవసరం లేదు. వేరే రంగంలో ప్రవేశించి రాణించవచ్చు. 

మురళీకృష్ణ విషయానికే వస్తే అతను మళ్ళీ తన ఊరికి వెళ్లిపోయి వ్యవసాయం చేసుకొని జీవించవచ్చు. అదే చేసి ఉండి ఉంటే అతని తల్లితండ్రులు చాలాచాలా సంతోషించి ఉండేవారు. చదువులు అనేవి విద్యార్ధుల నైపుణ్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వం పెంపొందించి ఏవిధంగా జీవించవచ్చో చెపుతాయి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదని విద్యార్ధులు అందరూ గ్రహించాలి.

Related Post