ఎంసెట్ కుంభకోణంలో శ్రీచైతన్య డీన్ అరెస్ట్

July 06, 2018
img

ఎంసెట్ (మెడికల్) ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణంలో రెండు ప్రముఖ కార్పోరేట్ కాలేజీలకు సంబంధాలున్నట్లు స్పష్టం అయ్యింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణా పోలీసులు శ్రీచైతన్య కాలేజీల డీన్ ఓలేటి వాసుబాబు, శ్రీచైతన్య, నారాయణా కాలేజీలలో విద్యార్ధులను చేర్పించే ఏజెంట్ కమ్మ శివనారాయణరావును అరెస్ట్ చేశారు. వారిలో ఓలేటి వాసుబాబు హైదరాబాద్ నగరంలో దిల్ షుక్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరు శ్రీ చైతన్య కాలేజీలకు డీన్ గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ ధనుంజయ థాకీర్, డాక్టర్ సందీప్ కుమార్ అనే ఇద్దరు వైద్యుల ద్వారా ఎంసెట్ (మెడికల్) ప్రశ్నాపత్రాలను ముందుగానే సంపాదించి, వాటిని ఒక్కో విద్యార్ధికి రూ.35 లక్షలు చొప్పున వసూలు చేసి అందజేస్తున్నారని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. దీనికోసం వారిరువురూ విద్యార్ధులు, తల్లితండ్రులతో ముందుగానే ఒప్పందం చేసుకొన్నారు. ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది కనుక శివనారాయణరావు సహాయంతో ఆరుగురు విద్యార్ధులను భువనేశ్వర్ తరలించి అక్కడ గుట్టుగా క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సంగతి పసిగట్టిన తెలంగాణా పోలీసులు పక్కా ఆధారాలతో సహా ఓలేటి వాసుబాబు, వనారాయణరావులను నిన్న అరెస్ట్ చేశారు. ఈ సంగతి తెలియగానే శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం ఓలేటి వాసుబాబును తమ సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 


Related Post