ఉపాద్యాయుల బదిలీలు ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయో?

June 23, 2018
img

రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల బదిలీలల ప్రక్రియ పూర్తవడంతో ఆరు నెలలపాటు నిషేధంవిధిస్తూ నాలుగైదు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ జూన్ 20వ తేదీతో పూర్తికావలసిన ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ నేటికీ పూర్తికాకపోగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఉపాధ్యాయులు తమకు కావలసిన ప్రాంతానికి బదిలీ చేయించుకోవడానికి తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లనుపెట్టడం, వాటిని విచారించేందుకు మెడికల్ కమిటీలు ఏర్పాటు చేయవలసి రావడం, ఆ కమిటీలు విచారణ జరిపి తప్పుడు దృవపత్రాలను సమర్పించిన ఉపాద్యాయులను సస్పెండ్ చేయడం, ఆ సస్పెన్షన్ ఎత్తివేయించుకోవడానికి ఉపాద్యాయులు తమ సంఘాల నేతలను, ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వారితో అధికారులపై ఒత్తిడి చేయించే ప్రయత్నాలు చేయడం, ఆన్-లైన్ వెబ్ ఆప్షన్లలో లోపాలు, వెబ్ సైట్ పనిచేయకపోవడం వంటి అనేక కారణాలతో ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు. 

కనుక నేటి నుంచి మళ్ళీ వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియను ప్రారంభించి జూన్ 29వ తేదీలోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తిచేసి, జూలై 1వ తేదీ నుంచి ఉపాద్యాయులు అందరూ విధులకు హాజరయ్యేలా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 

వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది: జూన్ 23: హెచ్.ఎం.లు, జూన్ 24,25: స్కూల్ అసిస్టెంట్లు, జూన్ 26,27: ఎస్జీటీలకు, పీఈటీలకు, పండిట్ లకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవలసి ఉంటుంది. 

ఈసారి పూర్తి పారదర్శకంగా, వేగంగా బదిలీల ప్రక్రియ జరపాలని విద్యాశాఖ భావిస్తే అందుకు విరుద్దంగా సాగుతోంది. జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అప్పుడే మూడు వారాలు గడిచిపోయాయి. అయినా ఇంకా ఈ బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. కనుక విద్యాశాఖ ఈసారైనా ఈ ప్రక్రియను ముగించగలిగితే ఉపాద్యాయులు విధులకు హాజరుకాగలుగుతారు. 

Related Post