రామగుండం గురుకుల పాఠశాలలో అక్రమాలు?

June 22, 2018
img

రామగుండం పట్టణంలో గల బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో అనేక అవకతవకలు జరుగుతునట్లు అనేక పిర్యాదులు అందుతుండటంతో వరంగల్ నుంచి ఉన్నతాధికారులు బుధవారం హటాత్తుగా అక్కడకు వెళ్ళి తనికీలు నిర్వహించారు. అయితే వారి రాక గురించి ముందే సమాచారం అందుకున్న కళాశాల సిబ్బంది, రికార్డులలో చూపకుండా ఒక గదిలో దాచిపెట్టిన బియ్యం, పప్పులు వగైరాలను ముందురోజు రాత్రే కళాశాల గోడవెనుక ఉన్న మురుగు కాలువలో పారబోశారు. తనికీలకు వచ్చిన అధికారులకు ఆ విషయం తెలియదు కనుక వారు రికార్డుల ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్నాయోలేవో చూసుకొని వెళ్ళిపోయారు. దాంతో కళాశాల సిబ్బంది గండం గడిచినట్లు సంతోషించారు. 

కానీ తనికీకి వచ్చిన అధికారులకు గురువారం ఉదయం వాట్స్ అప్ లో స్థానికుల నుంచి కొన్ని ఫోటోలు వచ్చాయి. వాటిలో కళాశాల భవనం వెనుక మురుగు కాలువలో పోసిన బియ్యం, పప్పుల ఫోటోలున్నాయి. దాంతో వారు మళ్ళీ తనికీలకు వచ్చారు. కానీ ఈసారి కూడా ముందుగానే ఆ విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది, బకెట్లతో నీళ్ళు తెచ్చి పోసి అక్కడ బియ్యం, పప్పులు కనబడకుండా కడిగేశారు. కనుక తనికీకి వచ్చిన అధికారులకు అక్కడ ఏమీ కనబడలేదు. కానీ ఈసారి వారు అనుమానంతో కాలువను అనుసరించి మరికాస్త ముందుకు వెళ్ళిచూడగా అక్కడ పేరుకుపోయిన బియ్యం, పప్పుల కుప్పలు కనిపించాయి. 

వాటిని చూసి షాక్ తిన్న అధికారులు కళాశాల సిబ్బందిని, విద్యార్ధులను, స్థానికులను పిలిపించి వారిని ప్రశ్నించి నిజానిజాలు తెలుసుకుని వారు చెప్పినవన్నీ రికార్డ్ చేసుకున్నారు. త్వరలోనే పైఅధికారులకు అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి నివేదిక పంపించనున్నట్లు వారు తెలిపారు. 

చాలా మంది విద్యార్దినులు తీవ్రరక్తహీనతో బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి మరింత పౌష్టికాహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తుంటే, మరోపక్క అవినీతి మేతకు అలవాటుపడిన కొందరు ప్రభుద్దులు విద్యార్దునులకు పెట్టవలసిన ఆహారాన్ని కూడా తామే బుక్కేయాలని చూస్తున్నారు. అది కుదరకపోతే బియ్యాన్ని మురుగుకాలువలలో పోయడానికి కూడా వెనుకాడటం లేదు. అటువంటివారిని ఏవిధంగా శిక్షించాలి?

Related Post