నీట్ లో కూడా తెలంగాణా విద్యార్ధులే టాప్!

June 05, 2018
img

ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాలలో తెలంగాణా విద్యార్ధి దురిశెట్టి అనిరుథ్ ఆల్ ఇండియా నెంబర్:1 ర్యాంక్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న వెలువడిన నీట్ ఫలితాలలో కూడా తెలంగాణా విద్యార్ధి రోహన్ పురోహిత్ 720 మార్కులకు  690లతో ఆల్ ఇండియా నెంబర్:2 ర్యాంక్ సాధించి తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. రోహన్ పురోహిత్ తల్లితండ్రులు భరత్ విజయ్, నిర్మల ఇద్దరూ వైద్యులే. వారి స్పూర్తితోనే అతను వైద్యవిద్యను అభ్యసించాలనే కోరిక మొదలయింది. డిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నానని రోహన్ పురోహిత్ చెప్పాడు.

బీహార్ రాష్ట్రానికి చెందిన కల్పనా కుమారి నీట్ లో 691 మార్కులు సాధించి ఆల్ ఇండియా నెంబర్:1 ర్యాంక్ సాధించగా, తెలంగాణా విద్యార్ధి  రోహన్ పురోహిత్ కేవలం ఒక్క మార్కు తేడాతో రెండవ స్థానంలో నిలిచాడు. నీట్ లో 25వ, 1267వ ర్యాంకులు కూడా తెలంగాణా విద్యార్దులే సాధించారు. 

1,267ర్యాంక్ పొందిన లావుడ్య హర్షవర్ధన్ మంచిర్యాల జిల్లాలో జన్నారం మండలంలోని ధర్మారం తండాకు చెందిన ఒక దళిత విద్యార్ధి. అతను ఎస్టీ కేటగిరీలో 5వ ర్యాంక్ సాధించాడు. 

తెలంగాణాకు చెందిన 44,877 విద్యార్ధులు నీట్ పరీక్షలు వ్రాయగా వారిలో 30,912 మంది అంటే 68.88 శాతం అర్హత సాధించడం విశేషం. 

నీట్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు కూడా తమ సత్తా చాటారు. టాప్ 50 ర్యాంకులలో 5 ర్యాంకులు సాధించారు. వారిలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం మెళియాపుట్టి మండలంలో కోసమాళ గ్రామానికి చెందిన అంకడాల అనిరుథ్ బాబు జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్ సాధించడం విశేషం. ఏపి నుంచి మొత్తం 49,253 మంది విద్యార్ధులు నీట్ వ్రాయగా వారిలో 35,732 మంది (72.54 శాతం) అర్హత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 94,130 మంది నీట్ వ్రాయగా వారిలో 66,644 మంది (70.79 శాతం) అర్హత సాధించడం విశేషం. 

Related Post