ప్రభుత్వం కృషి ఫలిస్తోంది

April 14, 2018
img

విద్యావ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలు నిరూపించాయి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల కంటే ప్రభుత్వం జూనియర్ కాలేజీలలో, రెసిడెన్షియల్ కాలేజీలలో చదువుకొన్న పిల్లలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. 

ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో 69 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులవగా, ప్రభుత్వ కాలేజీలలో 74.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ర్యాంకుల సాధనలోను ప్రభుత్వ కాలేజీలలో చదువుకొన్న విద్యార్ధులే అగ్రస్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాలు ప్రభుత్వ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీలు స్వంతం చేసుకొన్నాయి. 

ఇక ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన జూనియర్ కాలేజీలు 87 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటిస్థానంలో నిలబడగా, వాటి తరువాత సోషల్ వెల్ఫేర్ అధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు 86 శాతం, రెసిడెన్షియల్ కాలేజీలు 81 శాతం, ప్రభుత్వం జూనియర్ కాలేజీలు 70శాతం సాధించి మొదటి నాలుగు స్థానాలలో నిలిచాయి. 

ఇప్పటి వరకు ప్రైవేట్ కాలేజీల మద్యే ఇటువంటి పోటీ ఉండేది. కానీ ఇప్పుడు అవి ప్రభుత్వ కాలేజీలతో పోటీ పడవలసివస్తోంది. మరొక శుభపరిణామం ఏమిటంటే, ప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్న వివిధ కాలేజీలు ఒకదానితో ఒకటి పోటీలు పడుతూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయిప్పుడు.       

ఇక నిన్న విడుదలైన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలలో ఇంటర్ మొదటి సం.లో 62.73 శాతం, ఇంటర్ రెండవ సం.లో 67.06 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఒకేషనల్ మొదటి సం.లో 23,666 మంది, రెండవ సం.లో 23,412 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఇక ఇంటర్ రెండవ సం. ఫలితాలలో బాలురు: 60.99 శాతం, బాలికలు: 72.70 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఇక జిల్లాల వారిగా ఫలితాలు చూస్తే మేడ్చల్, కుమ్రుం భీమ్ జిల్లాలు 80 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. వాటి తరువాత స్థానాలలో రంగారెడ్డి (77 శాతం), ఖమ్మం (72 శాతం) నిలిచాయి. 

ఈ ఫలితాలలో చాలా వెనుకబడిపోయిన జిల్లాలలో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి కేవలం 40 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మెదక్ 49 శాతం, సూర్యాపేట 48 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాయి. 

ఖమ్మం జిల్లాకు చెందిన ఐలూరి శృతి, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వర్ణం శ్రీజ ఎంపిసిలో 994 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు.  

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి కనుక వీటిలో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. వాటి కోసం ఫీజు చెల్లించడానికి గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు ఉంది. 

Related Post