ఓయులో మళ్ళీ కొత్త సమస్య

April 06, 2018
img

ఉస్మానియా యూనివర్సిటీలో తరచూ ఏదో ఒక కారణంతో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తుతుంటాయి. గురువారం మళ్ళీ అవే పునరావృతం అయ్యాయి. సాధారణంగా ప్రముఖుల విగ్రహాలు విద్వంసం చేయడం వలన ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడుతుంటాయి కానీ ఉస్మానియాలో విగ్రహం ఏర్పాటు చేయడం వలన ఏర్పడ్డాయి. 

బషీర్ బాగ్ పిజి న్యాయకళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్ కుమార్ బుధవారం అర్ధరాత్రి రహస్యంగా ఉస్మానియా న్యాయకళాశాల  భవనం ముందు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం కాలేజీకి వచ్చినవారందరూ హటాత్తుగా ప్రత్యక్షమైన ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి స్పందిస్తూ, “నిన్న రాత్రి ఎవరో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై ఓయు విసి ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి కి పిర్యాదు చేశాము,” అని అన్నారు.

ఆ విగ్రహం ఏర్పాటు చేసిన డాక్టర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ, “ఆ విగ్రహం నేనే ఏర్పాటు చేశాను. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని గత 5 ఏళ్లుగా విద్యార్ధులు కోరుతున్నా ఉస్మానియా అధికారులు పట్టించుకోకపోవడం నేనే చొరవ తీసుకొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేశాను,” అని చెప్పారు. 

ఇప్పుడు అధికారులు అక్కడి నుంచి ఆ విగ్రహం తొలగించినా లేదా దానిని ఏర్పాటు చేసిన వినోద్ కుమార్ పై పోలీసులు చర్యలు తీసుకొన్నా అది ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షిస్తే, ఇటువంటి ఘటనలు పునరావృతం కావచ్చు. సున్నితమైన ఈ సమస్యను యూనివర్సిటీ అధికారులు ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Related Post