రేపటి నుంచే టి.ఆర్.టి పరీక్షలు

February 23, 2018
img

రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ (టి.ఆర్.టి.) పరీక్షలు రేపు అంటే శనివారం నుంచి మొదలవబోతున్నాయి. రేపటి నుంచి మార్చి 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. మొత్తం 8,792 ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం టి.ఎస్.పి.ఎస్.సి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఎస్.జి.టి.కి నిర్వహించే రాత పరీక్షలకు (ఆఫ్-లైన్) హైదరాబాద్ పరిధిలో కేంద్రాలు ఏర్పాటు చేసింది.

తెలుగు మీడియంలో వివిధ సబ్జెక్ట్ లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలను హెచ్.ఎం.డి.ఏ., కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది.      

పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు టి.ఎస్.పి.ఎస్.సి. అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్ధులకు ఎటువంటి సందేహాలున్నా టి.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్: 83339 23740 కు ఫోన్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈమెయిల్ చేసి తమ అనుమానాలు నివృతి చేసుకోవచ్చు. ఈ హెల్ప్ డెస్క్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఇది టి.ఆర్.టి. పరీక్షలు ముగిసేవరకు పని చేస్తుంది. 

 టి.ఆర్.టి. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు: 

1. అభ్యర్ధులు పరీక్షా సమయాలకు ముందుగా చేరుకోవాలి. ఆలశ్యంగా వస్తే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు. కనుక ఉదయం 9.15 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు 1.45 గంటలకు లేదా కాస్త ముందుగా ఉండాలి.

2. హాల్ టికెట్ తప్పనిసరి. దానితో బాటు తప్పనిసరిగా గుర్తింపు కార్డు అంటే ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డ్ లేదా పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

3. హాల్ టికెట్ పై అభ్యర్ధి ఫోటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్ధులు తప్పనిసరిగా రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను వెంట తెచ్చుకోవాలి.

4. అభ్యర్ధులు మొబైల్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, కాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి వాచీలు, పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, మహిళలు ఆభరణాలు పెట్టుకొని రాకూడదు. అలాగే చేతులకు, పాదాలకు మెహందీ పెట్టుకొని రాకూడదు. 

5. అభ్యర్ధులకు కేటాయించిన కంప్యూటర్లలో వారి వ్యక్తిగత వివరాలు, ఫోటో వగైరా కనిపిస్తాయి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే పరీక్ష నిర్వాహకులకు తెలియజేయాలి. 

6. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులు తోడుగా తమ కుటుంబ సభ్యులను లేదా ఈ పరీక్షా విధానాల గురించి తెలిసున్న స్నేహితులను వెంట బెట్టుకొని కేంద్రాలకు చేరుకోవడం మంచిది. ఒకవేళ ఆఖరు నిమిషంలో ఏదైనా అనుకోని ఇబ్బంది ఏర్పడితే వారి సహాయం పొందవచ్చు.

ప్రతీసారి ఈ పరీక్షలప్పుడు అనేకమంది అభ్యర్ధులు ఊహించని కారణాల చేత పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడం, వారిని లోపలకు అనుమతించకపోవడం వలన కన్నీళ్లు పెట్టుకొని బాధపడటం జరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అభ్యర్ధులు అందరూ ముందుగానే తమతమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో, అక్కడకి ఏవిధంగా చేరుకోవాలో మొదలైన వివరాలను తెలుసుకొని కనీసం ఒక గంట ముందుగా అక్కడకు చేరుకోవడం మంచిది. ఈ పరీక్షలకు హాజరుకాబోతున్న అభ్యర్ధులు అందరికీ ‘మైతెలంగాణా.కామ్  తరపున ‘బెస్ట్ విషెస్’ తెలియజేస్తున్నాము.

Related Post