మన భూపాలపల్లి..ఇప్పుడు పర్యాటక కేంద్రం

December 26, 2017


img

మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. ప్రభుత్వంలో..దానిలో పనిచేసే అధికారులు..ఉద్యోగులలో తపన, చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి గొప్ప మార్పులు వస్తాయో తెలుసుకోవాలనుకొంటే భూపాలపల్లి జిల్లాలో వీరభద్రవరం గ్రామం సమీపంలో గల గడ్డలసరి జలపాతం (వాటర్ ఫాల్స్)కు ఒకసారి వెళ్ళకతప్పదు. దేశంలోకెల్లా అత్యంత ఎత్తైన జలపాతాలలో మూడవదిగా నిలుస్తున్న దీనిని సమైక్య రాష్ట్రంలో పట్టించుకొనే నాధుడే లేడు. సహజసిద్ధంగా ఏర్పడిన ఆ జలపాతం, దాని పరిసర ప్రాంతాలలో కొండలు..వందల ఎకరాలలో పచ్చగా పరుచుకొన్న అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లయితే రాష్ట్రంలో అదొక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చవచ్చని గుర్తించిన జిల్లా అటవీశాఖ, ఎకో-టూరిజం సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆ ప్రాంతాలన్నీ కాలినడకన కలియతిరిగి, కొన్ని ముఖ్యప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన ‘తడ్వి కాటేజీలు’ నిర్మించారు. రాక్ క్లైమ్బింగ్ (పర్వతారోహణ), ట్రెక్కింగ్ (అడవిదారులలో కాలినడక), లక్నవరం ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఈ ఏర్పాట్లన్నీ యుద్దప్రాతిపదికన సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి, ఈ పర్యాటక ప్రాంతం గురించి గట్టిగా హైదరాబాద్ నగరంలో ప్రచారం చేయడంతో, ఈ మూడు నెలలోనే సుమారు 2,000 మందికి పైగా ఇక్కడికి వచ్చి ఒకటి రెండురోజులు ప్రకృతి మద్య హాయిగా సంతోషంగా గడిపి వెళ్ళారని జిల్లా ఎకో టూరిజం కో-ఆర్డినేటర్ సుమన్ కళ్యాణపు తెలిపారు. తాము నిర్మించిన ఆరు తడ్వి కాటేజీలకు మంచి డిమాండ్ ఉంటోందని, నిత్యం వాటికి బుకింగ్స్ అవుతున్నాయని చెప్పారు. ఈ పర్యటనకు నగరవాసులు ఆన్-లైన్ లో బుకింగ్ చేసుకొనేందుకు ఒక వెబ్ సైట్ ను కూడ ప్రారంభించమని దానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. 

 “హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి వారాంతపు శలవులలో ఇక్కడకు వచ్చి గడిపి వెళ్లేందుకు వీలుగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. శనివారం ఉదయం వచ్చి ఆదివారం రాత్రి తిరిగి వెళ్ళేవిధంగా మేము రూ.1200 నుంచి రకరకాల ప్యాకేజ్ టూర్లను సిద్దం చేశాము. తడ్వి కాటేజీలో ఒక రోజుకు మేము రూ.1,000 ఛార్జ్ చేస్తున్నాము. అవి సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలలో ఉండటం చేత, హైదరాబాద్ నుంచి రోజూ చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు,” అని చెప్పారు ఈ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లలో ఒకరైన సిద్దార్థ్ మకే.

ఈ ప్రాజెక్టు గురించి జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్ వివరిస్తూ, “రాష్ట్రంలో అత్యధిక పచ్చదనం ఉన్న ప్రాంతం ఇది. పైగా మంచి జలపాతం, చక్కటి ప్రకృతి కూడా ఉంది. అందుకే మేము ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా ఈ ప్రాంతంలో గల పర్యాటక ఆకర్షణ కేంద్రాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నాము.  ఈ ప్రాంతాలలో కొన్ని చోట్ల కొండరాళ్ళపై చెక్కబడిన బొమ్మలు కూడా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి,” అని చెప్పారు. 

ఇక ఈ అక్టోబర్ నెల నుంచి అమరాబాద్ ప్రాంతంలో పెద్ద పులుల అభయారణ్యం కూడా ఉంది. దోమలపెంట గ్రామానికి సుమారు 5 కిమీ దూరంలో గల ఆ ప్రాంతంలో ‘అక్టోపస్ వ్యూ పాయింట్’ ను ప్రారంభించామని అమరాబాద్ పెద్ద పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ మోహన్ చంద్ర పరాగెన్ చెప్పారు. అక్కడి నుంచి చూస్తే దిగువన పారుతున్న కృష్ణానది, సువిశాలంగా పరుచుకొన్న అడవులు కనిపిస్తాయని తెలిపారు. ఇది హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గంలో మన్ననూర్ గ్రామానికి 42కిమీ దూరంలో ఉందని తెలిపారు. నగరం నుంచి వచ్చే ప్రజలకు అభయారణ్యంలో సంచరించే పులులు, ఇతర జంతువులను చూసేందుకు ఒక వాచ్ టవర్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతం గురించి ప్రచారం చేసి, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాత రోజురోజుకి ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, అది చూసి తమ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అధికారులు అన్నారు. 

ఇంత చెప్పుకొన్న తరువాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఒకసారి గడ్డలసరి జలపాతం..అక్కడి పచ్చటి ప్రకృతిని ఆస్వాదించి వస్తే బాగుంటుంది కదా!  



Related Post