ఆ పార్టీ అందుకే ఎన్నికలలో పోటీ చేయదట!

December 25, 2017


img

“మరొక ఏడాది ఓపికపడితే నేనే ముఖ్యమంత్రి అయిపోతాను..మీ సమస్యలన్నిటినీ ఒక్క దెబ్బతో పరిష్కరించిపడేస్తాను,” అని చెప్పుకొంటూ కాళ్ళరిగిపోయేలా పాదయాత్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించడం విశేషం. అందుకు అయన చెప్పిన కారణం ఇంకా విచిత్రంగా ఉంది. ఉపఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బు కుమ్మరించేసి విజయం సాధిస్తుంటారని కనుక ఎన్నికలలో ప్రజాస్వామ్యం అమ్ముడుపోవడం ఇష్టం లేకనే పోటీ చేయడం లేదని జగన్ తరపున వైకాపా ప్రకటించింది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే వైకాపా ఉపఎన్నికలలో పోటీ చేయకపోతే, 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా పోటీ చేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయ్యే సమయం అదే గనుక! 

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో తెదేపా తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పామోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. 

చంద్రబాబుకు దమ్ముంటే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలను ఎదుర్కోమని జగన్మోహన్ రెడ్డి నిత్యం సవాలు విసురుతుంటారు. కానీ తీరాచేసి ఎన్నికలు వస్తే ఇటువంటి కుంటిసాకులతో పోటీ చేయమని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

మరో గమ్మతైన విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు కూడా కుంటిసాకు చెప్పి డుమ్మా కొట్టి పాదయాత్రలు చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని జగన్ చెప్పారు. 

అయితే జగన్ పాదయాత్ర చేస్తూ ఏ జిల్లాలో ఉన్నప్పటికీ ప్రతీ శుక్రవారం క్రమం తప్పకుండా హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ఎందుకంటే కోర్టు ఆదేశించింది కనుక. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారందరూ తప్పనిసరిగా చట్టసభలకు హాజరుకావాలని లేకుంటే అనర్హత వేటు వేయాలనే చట్టం కూడా ఉండి ఉంటే ఎవరూ సమావేశాలను తప్పించుకొనే ధైర్యం చేసేవారుకారేమో?

ఇటువంటి నిర్ణయాలతో జగన్ వైకాపాకు శల్యసారధ్యం చేస్తున్నారా? అని సందేహం కలిగితే తప్పు కాదు. ఏది ఏమైనప్పటికీ వైకాపాకు ఆయనే శత్రువు...ఆయనే బలం కూడా అని చెప్పక తప్పదు. ఉపఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకాడుతున్న జగన్ వచ్చే ఎన్నికలలో తెదేపాను ఏవిధంగా డ్డీ కొనాలనుకొంటున్నారో? ఏవిధంగా తెదేపాను ఓడించి అధికారంలోకి రావాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. 


Related Post