అమ్మ వారసురాలు చిన్నమే...నా?

December 25, 2017


img

ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన శశికళ మేనల్లుడు దినకరన్ ఘన విజయం సాధించారు. అయన మొత్తం 89,013 సాధించగా, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె అభ్యర్ధి మధుసూధన్ కు 48,306 ఓట్లు, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అభ్యర్ధి గణేషన్ కు 24,651 ఓట్లు, భాజపా అభ్యర్ధి నాగరాజన్ కు 1,417 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలలో పోటీ చేసినవారిలో 56 మంది అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం చూసినట్లయితే ఈ ఉపఎన్నికలు ఎంత ఏకపక్షంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో నటుడు విశాల్, దీపా పోటీ చేయగలిగి ఉండి ఉంటే వారూ బహుశః డిపాజిట్లు కోల్పోయి ఉండేవారేమో కనుక వారి నామినేషన్లు తిరస్కరణకు గురవడం వారి అదృష్టంగానే చెప్పవచ్చు. 

గత ఏడాది ఇదే నియోజక వర్గం నుంచి జయలలిత పోటీ చేసినప్పుడు ఆమెకు 39,545 ఓట్లు మెజార్టీ లభించగా, ఆమె పేరు చెప్పుకొని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన దినకరన్ 40,707 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. కనుక అన్నాడిఎంకె పార్టీని, దాని ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తును, ప్రభుత్వాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దక్కించుకొన్నప్పటికీ ‘అమ్మ’ కు అసలైన వారసురాలు శశికళేనని దినకరన్ తన విజయం ద్వారా నిరూపించినట్లయింది. 

సుమారు ఆరేడు నెలల క్రితం శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసినప్పటి నుంచి తీవ్ర వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటున్న శశికళ వర్గానికి ఈ ఘన విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళిన శశికళకు ఇది చాలా ఆనందం కలిగించే విషయమే. ఆమె జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే ‘చక్రం’ తిప్పగలరని ఈ ఉపఎన్నికలు ఫలితాలు నిరూపించాయి. కనుక ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయనతో జత కట్టి మంత్రి పదవి పొందిన పన్నీర్ సెల్వం వర్గాలకు ఇకపై తరచూ అగ్నిపరీక్షలు ఎదుర్కోక తప్పకపోవచ్చు. 


Related Post