అక్కడ భాజపా పరిస్థితి అదీ...

December 25, 2017


img

ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకొన్న భాజపా ఇక దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడతామని చెప్పుకొంది. దానికి చెన్నైలోని ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కలేదు. తమిళనాడులో అడుగుపెట్టాలని చాలా ఉబలాటపడుతున్న భాజపాకు అక్కడి ప్రజలు పెద్ద షాకే ఇచ్చారు. నిన్న వెలువడిన ఫలితాలలో ‘నోటా’ (పోటీ చేస్తున్న అభ్యర్ధులలో ఎవరికీ ఓట్లు వేయకుండా తిరస్కరించడం) ఆప్షన్ కు 2,373 ఓట్లు పోల్ అవగా, భాజపాకు కేవలం 1,417 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను జయించామని గొప్పలు చెప్పుకొంటున్న భాజపాకు దక్షిణాది రాష్ట్రాలలో ఇదీ పరిస్థితి. విజయోత్సాహంతో ఉన్న భాజపాపై తమిళప్రజలు నీళ్ళు జల్లేసి చల్లార్చేసి, ఇప్పట్లో దానికి తమిళనాడులో అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో దానికి ప్రజలు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు. ఇక ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలలో యధాప్రకారం భాజపా కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు లేదా వివిధ కారణాల చేత ఇదివరకటి కంటే తక్కువ సీట్లతో సరిబెట్టుకోవలసిరావచ్చు. కనుక దక్షిణాది రాష్ట్రాలలో దానికి ఇదివరకు 20 ఏళ్ళ పాటు పాలించిన కర్నాటక రాష్ట్రం ఒక్కటే కనిపిస్తోంది. ఈ సంగతి భాజపా అధిష్టానం కూడా గుర్తించబట్టే ఇకపై ఆ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరిస్తామని అంటోందేమో? 

ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన శశికళ మేనల్లుడు దినకరన్ చేతిలో అధికార అన్నాడిఎంకె అభ్యర్ధి మధుసూదన్ ఓడిపోయారు. ఆయనపై దినకరన్ 40,707 ఓట్లు బారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ కారణంగా అధికార అన్నాడిఎంకె పార్టీలో మళ్ళీ సంక్షోభం మొదలయ్యేయ్యి అది తమిళనాడులో మళ్ళీ రాజకీయ అనిశ్చితికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నికలలో గెలిచిన తరువాత దినకరన్ మీడియాతో మాట్లాడుతూ “నేటి నుండి సరిగ్గా మూడు నెలలలోగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వం పడిపోబోతోంది” అని చెప్పడమే అందుకు మొదటి సంకేతం. రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ అనిశ్చితి ఏర్పడినట్లయితే తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు రాజకీయ పార్టీ స్థాపించడం కూడా ఖాయమేనని భావించవచ్చు. 


Related Post