వారు అసమదీయులా...తసమదీయులా? జర సూడుండ్రి!

December 23, 2017


img

గత రెండుమూడు దశాబ్దాల నుంచి న్యాయస్థానాల తీర్పులపై రాజకీయ వర్గాలలో, ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సర్వసాధారణమైంది. అందుకు కారణం తీర్పులపై రాజకీయ ప్రభావం ఉందని భావించడమే. ఏదైనా ఒక పెద్ద కేసును ఎదుర్కొంటున్న వ్యక్తికి అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయ సంబంధాలు ఉన్నట్లయితే, ఆ కేసుపై ఎన్నేళ్ళయినా విచారణ పూర్తవదు. తీర్పు వెలువడదు. విచారణ ఎందుకు పూర్తవదు? తీర్పు ఎందుకు వెలువడదు? అని ఎవరికీ సందేహం రాదు. ఎందుకంటే కారణాలు అందరికీ తెలుసు. 

అదే అధికారపార్టీతో రాజకీయ శత్రుత్వం ఉన్న వ్యక్తికి సంబందించిన కేసులు అప్పటికప్పుడు మొదలయిపోతాయి. ఊహించని వేగంతో కేసు విచారణ జరిగి తీర్పులు వెలువడుతుంటాయి. ఉదాహరణకు ఓటుకు నోటు కేసును చూసినట్లయితే, అది మొదలైన కొత్తలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళకుండా ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళివచ్చేరు. ఆ తరువాత నిప్పులపై నీళ్ళు జల్లినట్లు ఆ కేసు హటాత్తుగా చల్లారిపోయింది. ఆ కేసు ఎందుకు ముందుకు సాగడం లేదనే విషయం బహిరంగ రహస్యం. 

అలాగే నిన్న 2జి స్పెక్ట్రం కేసులో ఏ.రాజా, కనిమోలితో సహా అందరూ నిర్దోషులని సిబిఐ కోర్టు ప్రకటించగానే తమిళనాడులో ప్రతిపక్ష డిఎంకెను మంచి చేసుకోవాలని భాజపా ప్రయత్నిస్తోందని, అందుకే ప్రధాని మోడీ ఇటీవల చెన్నై వెళ్ళినప్పుడు డిఎంకె అధినేత కరుణానిధి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారని, అందుకే ఆయన కుమార్తెతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న డిఎంకే నేతలందరికీ విముక్తి కల్పించారని మీడియాలో కధనాలు వినిపించాయి. అంటే ఆ కేసులో సిబిఐ కోర్టు తీర్పుపై రాజకీయ ప్రభావం ఉందని చెపుతున్నట్లే భావించవచ్చు. వాస్తవానికి ఆ తీర్పుకు, భాజపా-డిఎంకె దోస్తీకి నిజంగా లింకు ఉందని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో చూసినట్లయితే ఉందనే అనుమానం కలుగడం సహజం. 

ఇక గడ్డి కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా సిబిఐ కోర్టు నిర్దారించగానే, కేంద్రప్రభుత్వం తనపై ఈవిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని లాలూ ప్రసాద్ ఆరోపించడం గమనిస్తే, కోర్టు తీర్పులకు, రాజకీయాలకు కనబడని ‘లింక్’ ఏదో ఉందని అర్ధం అవుతుంది. 

కనుక కేసులను ఎదుర్కొంటున్నవారు అధికారపార్టీకి అసమదీయులా లేక తసమదీయులా అనే దానిపై కేసుల చలనం, తీర్పులు ఆధారపడి ఉంటాయని జనం కూడా భావించే పరిస్థితి నెలకొని ఉంది. రాజకీయ నాయకులు లేదా వారి అనుచరులు, స్నేహితులు, బంధుగణంపై ఉన్న ఏ కేసును తీసుకొని అవి సాగుతున్న తీరును చూసినా ఈ వాదన నిజమేననే అభిప్రాయం కలుగకమానదు. 


Related Post