ఆ కేసులో లాలూ దోషేనట!

December 23, 2017


img

ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకు? అంటారు. కానీ బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూ.1,000 కోట్ల పశువుల దాణా కుంభకోణం కేసులో దోషి అని సిబిఐ కోర్టుతో సహా అందరికీ తెలిసిన నిజాన్ని దృవీకరించడానికి న్యాయస్థానానికి 20 ఏళ్ళు పట్టింది. ఈ కేసును విచారిస్తున్న రాంచీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను ఈరోజు దోషిగా ప్రకటించింది. ఆయనతో సహా మరో 15మందిని కూడా దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న లాలూ సన్నిహితుడు మాజీ ముఖ్యమంత్రి జగన్నాద్ మిశ్రాతో సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయమూర్తి శివపాల్ సింగ్ తీర్పు వెలువరించిన వెంటనే పోలీసులు లాలూ ప్రసాద్ యాదవ్ ను ఇతర దోషులను బిర్సా ముండా సెంట్రల్ జైలు కు తరలించారు. జనవరి 3వ తేదీన వారికి శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. 

లాలూ తదితరులపై మొత్తం ఆరు కేసులు నమోదు చేయబడగా వాటిలో ఒక దానిపై నేడు ఈ తీర్పు వెలువడింది. కనుక మిగిలిన కేసులు లాలూ జీవితకాలంలో విచారణ పూర్తవుతాయో లేదో అనుమానమే. లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశువుల దాణా కోసమని ప్రభుత్వ ఖజానా నుంచి రూ.84.5 లక్షలు పైగా సొమ్మును తీసుకొన్నట్లు లాలూ తదితరులపై సిబిఐ అభియోగాలు మోపింది. 1996లో ఆ కేసు బయటపడినప్పుడు అది జరిగిన తీరు చూసి యావత్ దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, లాలూ సర్కార్ పెట్టిన బిల్లులలో గేదెలు, ఆవులను తరలించడానికి వాడిన వాహనాల నెంబర్లను పరిశీలించగా అవి ఆటో రిక్షాలు, స్కూటర్లు, మోటార్ సైకిల్స్ అని తేలింది. అలాగే లెక్కలలో చూపించిన పశువులకు వాటికి దాణా, మందులు, ఇంకా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఇతర వస్తువులకు ఎక్కడా పొంతన లేదు.

అప్పటి నుంచే లాలూ పశువుల నోటి కాడ గడ్డిని కూడా తినేశారనే జోక్ మొదలైంది. 1997, అక్టోబర్ 27న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తరువాత 1998లో మళ్ళీ సిబిఐ లాలూ, ఆయన భార్య రబ్రీదేవిపై  అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ పూర్తయ్యేసరికి 16 సం.లు పట్టింది. 2013 లో ఆయనకు సిబిఐ కోర్టు ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆ కారణంగా 6 ఏళ్ళపాటు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. కానీ మళ్ళీ బెయిల్ పై బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఈ కేసులో దోషిగా నిర్ధారించబడటంతో మళ్ళీ జైలు ఊచలు లెక్కపెట్టక తప్పలేదు. కానీ సిబిఐ తీర్పుపై మళ్ళీ హైకోర్టుల అప్పీలు చేస్తానని లాలూ వెంటనే ప్రకటించారు కనుక మళ్ళీ త్వరలోనే బెయిల్ పై బయటకు రావడం ఖాయం. 


Related Post