పాక్ సర్కార్ విలవిల!

December 23, 2017


img

పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. అది పెంచిపోషించిన విషనాగు ఇప్పుడు దానినే కాటేయడానికి సిద్దపడుతుంటే ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకొంది. ఆ విషనాగు పేరు హఫీజ్ సయీద్. ముంబై ప్రేలుళ్ళ ప్రదానసూత్రదారి. ఐక్యరాజ్యసమితి చేత ఉగ్రవాదిగా ముద్రపడినవాడు. అమెరికా ప్రభుత్వం అతని తలకు లక్షల డాలర్లు వెలకట్టిన కరడుగట్టిన ఉగ్రవాది. 

ఇంతకాలం పాక్ ప్రభుత్వం అతనిని వెనకేసుకువచ్చింది. అతనిని దోషిగా నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లేవని చెపుతూ న్యాయస్థానం ఈ మద్యనే అతనిని గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి అతను భారత్ పై రంకెలు వేస్తూనే ఉన్నాడు. భారత్ చెర నుంచి కాశ్మీర్ ను విముక్తి కల్పించి, 1972 భారత్-పాక్ యుద్దంలో పాక్ ఓటమికి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేశాడు. 

అతను భారత్ ను ఎంత ద్వేషించినా, ఎన్ని దాడులు చేసినా పాక్ అతనికి సహకరించగలదు. కానీ పాక్ ప్రభుత్వానికే ఎసరు పెడతానంటే సహించగలదా? అతను భారత్, అమెరికా, ఐక్యరాజ్యసమితి ఒత్తిళ్ళ నుంచి తప్పించుకొనేందుకు మిల్లి ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో పోటీ చేసి పాక్ లో రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనుకొన్నాడు. తద్వారా చట్టంతో కవచం ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాడు. ఒక కరడుగట్టిన ఉగ్రవాది చేతికి ప్రభుత్వమే అందితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. అందుకే అతని పార్టీకి గుర్తింపు ఇవ్వకుండా             ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అది చాలా అవసరమే లేకుంటే ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాకిస్తాన్ కు ప్రధానమంత్రి అయినా అవగలడు. 

పాక్ ప్రభుత్వం అతనిని అడ్డుకోవాలని చూడటం బాగానే ఉంది కానీ అందుకు అది చెపుతున్న కారణం దానిని మళ్ళీ ప్రపంచ దేశాలకు పట్టిస్తోంది. ఇంతకాలం అతను ఉగ్రవాది కాదని వాదిస్తున్న పాక్ ప్రభుత్వం, ఇప్పుడు అతను ఉగ్రవాది అని అతనిని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేందుకు అనుమతిస్తే చాలా ప్రమాదమని వాదిస్తోంది. అతను వేరే పేరుతో రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ, అది దాని మాతృసంస్థ అయిన లష్కర్ –ఏ-తయిబా ఉగ్రవాద సంస్థ ఆలోచనలకు అది భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదని కనుక అది కూడా ఆ ఉగ్రవాదసంస్థకు అనుబంధ సంస్థగానే మారే ప్రమాదం ఉందని పాక్ ప్రభుత్వం వాదిస్తోంది. 

అంటే అతను ఉగ్రవాది అని పాక్ ప్రభుత్వం అంగీకరించినట్లు అర్ధం అవుతోంది. అది పెంచి పోషించిన హఫీజ్ సయీద్ ఇప్పుడు దాని వేలుతోనే దాని కళ్ళను పొడిచేందుకు సిద్దమయినందునే అది ఇప్పటికైనా అతను ఒక కరడుగట్టిన ఉగ్రవాది అని అంగీకరిస్తోంది. కనుక ఇప్పటికైనా అతనిని భారత్ కు అప్పగిస్తే అన్ని సమస్యలు ఒక తాడుతో పరిష్కారం అయిపోతాయి. 


Related Post