గుజరాత్ ఎన్నికలలో చాలా నేర్చుకొన్నాను

December 23, 2017


img

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఓడిపోయిన తరువాత మొట్ట మొదటిసారిగా ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యూ.సి.) సమావేశం నిన్న డిల్లీలో జరిగింది. పార్టీ అధ్యక్షుడుగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటమి, పార్టీ పరిస్థితి, భవిష్య కార్యాచరణ గురించి మాట్లాడుతారని ఆశించడం సహజమే కానీ అటువంటి ప్రయత్నం చేయకుండా తన ప్రసంగంలో భాజపాను, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికే పరిమితం అయ్యారు. 

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “గుజరాత్ ఎన్నికలలో మేము ఓడిపోవడం చాలా నాకు బాధ కలిగించినప్పటికీ అక్కడ భాజపాకు గట్టి పోటీనివ్వగలిగినందుకు సంతోషంగా ఉంది. ఆ ఎన్నికలలో నేను చాలా కొత్త విషయాలు తెలుసుకొన్నాను. ఎన్నికలలో భాజపా ప్రచారశైలి, చిత్రవిచిత్రమైన వ్యూహాలు, వాటి వెనుక దాని ఉద్దేశ్యాలు అన్నీ అర్ధం చేసుకొన్నాను. అబద్దాలతో ప్రజలను మోసపుచ్చుతూ వారి మద్య చిచ్చు పెట్టి ఏవిధంగా అది గెలిచిందో కళ్ళారా చూశాను. ఎన్నికలలో గెలిచి అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రధాని మోడీ మా పార్టీపై, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి కూడా వెనుకాడలేదు. దానినీ బట్టబయలు చేసి ఆయన అసలు రూపం ఏమిటో బయటపెట్టగలిగాము.

అయితే భాజపా అబద్దాల పునాదిపై నిర్మించుకొన్న కంచుకోటను ఈ ఎన్నికలలో పునాదులతో సహా కూలద్రోయగలిగాము. మోడీ రూపొందించిన భూటకపు గుజరాత్ అభివృద్ధి నమూనాను ప్రజల కళ్ళ ముందుంచి, అది పూర్తిగా లోపభూయిష్టమైనదని నిరూపించి చూపగలిగాము. 

భాజపా సిద్దాంతం ఏమిటంటే, ముందుగా ఒక అబద్దాని సృష్టించడం, తరువాత దానికి విస్తృతమైన ప్రచారం కల్పించడం, తద్వారా దానిని నిజమని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం. 2జి స్పెక్ట్రం కేసులో కూడా మోడీ సర్కార్ అదే చేసింది. కానీ ఆ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి చెంపదెబ్బలాగ తగిలింది. అందుకే ఇప్పుడు దేశప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. తిరిగి ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అది అయన నిర్మించుకొన్న కంచుకోటలోనే మొదలయింది. 

గుజరాత్ నుంచి మోడీ చాలా రాజకీయ లబ్ది పొందారు. కానీ అందుకు ప్రతిగా అయన గుజరాత్ కు ఏమి చేయకపోగా రాష్ట్రాన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పగించేసి ప్రజలను దోచుకోవడానికి అనుమతించేశారు. అందుకే ఈసారి ఎన్నికలలో గుజరాత్ ప్రజలు భాజపా పట్ల తీవ్ర వ్యతిరేకత చూపారు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన మా పార్టీ ఆ ఎన్నికలలో ఓడిపోయింది. అక్కడ ఎదురైనా అనుభవాలను, చేసిన పొరపాట్లను అన్నిటినీ క్రోడీకరించుకొని మేము ముందుకు సాగుతాము,” అని రాహుల్ గాంధీ చెప్పారు. 


Related Post