నేడు పీవీసారు వర్ధంతి

December 23, 2017


img

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవి నరసింహారావు గారి వర్ధంతి ఈరోజు. అయన అచ్చమైన తెలుగువాడు. అచ్చమైన తెలంగాణా బిడ్డడు. అచ్చమైన కాంగ్రెస్ వాది. స్వాతంత్ర్య పోరాట వీరుడు. సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర హోంమంత్రి, రక్షణమంత్రి, విదేశాంగ మంత్రి వంటి కీలకమైన పదవులను అవలీలగా నిర్వహించారు. దేశం చాలా క్లిష్టపరిస్థితులలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఒక కాపు కాసిన మహానుభావుడు. దేశ ఆర్ధిక వ్యవస్థలో ఉదారవాద సంస్కరణలు ప్రవేశపెట్టిన దేశ ఆర్దికవ్యవస్థను కొత్తమలుపు తిప్పిన సంస్కరణవాది. సమస్యలను పరిష్కరించడంలో అపర చాణుక్యుడు. మౌనం, స్థిత ప్రజ్ఞత అయన సహజ సుగుణాలు. అనేక పుస్తకాలను రచించిన మహారచయిత. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఒడియా, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, సంస్కృతం, స్పానిష్, జర్మన్, అరబిక్ మొదలైన 17 బాషలపై పూర్తి పట్టుకలిగి మాట్లాడగలిగిన మహా పండితుడు. 

కానీ అయన తెలుగువాడు. కనుకనే జాతీయస్థాయిలో ఆయనకు దక్కవలసినంత సముచిత గౌరవం దక్కలేదు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినా ఆయన చనిపోయినప్పుడు అయన భౌతిక కాయానికి డిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించబడలేదు. ఆ మహానుభావుడికి హైదరాబాద్ లో అంత్యక్రియలు జరిగినప్పుడు చాలా అపచారమే జరిగింది. అవన్నీ తలుచుకొంటే నేటికీ ప్రతీ తెలుగువాడి మనసు కలుక్కుమంటుంది. అయితే పురస్కార, తిరస్కారాలకు అతీతుడనని కాంగ్రెస్ పార్టీలో ఉండగానే నిరూపించుకొన్నారు. 

ఆయన అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహరావు. అప్పటి వరంగల్ జిల్లాలో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సీతారామారావు, రుక్మిణమ్మ దంపతులకు 1921, జూన్ 28న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ డిగ్రీ చేశారు. 1940లో కాకతీయ పత్రికలో ఎడిటర్ గా పనిచేశారు. అక్కడి నుంచే స్వాతంత్ర్యోద్యమంలోకి... కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి తుది శ్వాసవరకు కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసమే పనిచేశారు. అయన 1991-1996వరకు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారు. డిసెంబర్ 23, 2004లో అయన గుండెపోటుతో కన్నుమూశారు. దేశానికి ఇంతగా సేవలు చేసిన ఆ మహానుభావుడిని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేకపోయినా తెలంగాణా ప్రభుత్వం మాత్రం అయన జన్మదినాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పివి సంస్మరణ సభ జరుగుతుంది. 


Related Post