తెరాస నేతలు పార్టీ ఫిరాయించబోతున్నారా?

December 22, 2017


img

తాజా రాజకీయాలలో ‘పార్టీని బలోపేతం చేసుకోవడమంటే’ ఎదుటపార్టీలో నేతలను పార్టీలోకి ఆకర్షించడమనే అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమందిని పార్టీ ఫిరాయింపజేసి  పార్టీలో చేర్చుకొంటే అంత గొప్ప విషయంగా పరిగణింపబడుతోంది తప్ప అందుకు ఎవరూ సిగ్గుపడటం లేదు. 

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మున్ముందు మరింతబలపడుతుంది. కొంతమంది తెరాస నేతలు మా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా వారు మా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇకపై రాహుల్ గాంధీ తెలంగాణా రాష్ట్రంపై ఎక్కువ దృష్టి సారించబోతున్నారు. వచ్చే నెల నుంచి అయన తరచూ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. మళ్ళీ ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు ఆయనను ఆహ్వానించాలని అనుకొంటున్నాము. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నందున 2018లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చేర్పులు చేయబోతున్నాము,” అని చెప్పారు.

వచ్చే ఎన్నికలలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం కనబడటం లేదు కనుక టికెట్స్ ఆశించి తెరాసలో చేరిన ఇతర పార్టీల నేతలందరూ తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ లోకి వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్న పార్టీని వదిలి అధికారంలోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ పార్టీలో చేరడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది కనుక అటువంటివారందరూ ఎన్నికలు దగ్గర పడేవరకు వేచి చూసి ఫిరాయింపులకు సిద్దపదవచ్చు.    

అటువంటివారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్పడానికి కాంగ్రెస్ కూడా సిద్దంగానే ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, తెరాసకు ఎదురయ్యే సమస్యే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురవకమానదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య బారీగానే ఉంటుంది. కానీ తెరాస నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయింపులు మొదలుపెట్టగలిగితే, కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందనే భావన ప్రజలలో వ్యాపింపజేయగలుగుతుంది. కనుక టికెట్ల సంగతి తరువాత..ముందు ఫిరాయింపులు మొదలుపెట్టడమే మంచిదని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావించడం సహజమే.  


Related Post