భాజపా తదుపరి లక్ష్యం...మారిందా?

December 19, 2017


img

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో విజయం సాధించినందున తమ తదుపరి లక్ష్యం కర్నాటక రాష్ట్రమేనని  భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. తమ పార్టీ వరుస విజయాలు సాధిస్తూ ‘కాంగ్రెస్ ముక్తా భారత్’ (కాంగ్రెస్ రహిత భారతదేశం) వైపు వడివడిగా అడుగులు వేస్తోందని అన్నారు. వంశపాలన, వారసత్వ రాజకీయాలు, కులమత రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు. అభివృద్ధే తమ పార్టీ అజెండా అని, దేశంలో అన్ని రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి వచ్చినప్పుడే అభివృద్ధి వేగం పుంజుకొంటుందని అన్నారు. తెలంగాణాలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేస్తున్నామని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని మురళీధర్ రావు చెప్పారు. 

దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా రాష్ట్రమే భాజపా గెలిచేందుకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని ఇదివరకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా గెలిచినందున మంచి విజయోత్సాహంతో ఉన్న భాజపా నేతలు వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తామని అంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడక మునుపే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆ ముక్క  అన్నారు కూడా.

అయితే రెండు రాష్ట్రాలలో విజయం సాధించిన తరువాత మాట్లాడిన భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తెలంగాణాలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేస్తామని, తమ తదుపరి లక్ష్యం కర్నాటక రాష్ట్రమని చెప్పడం గమనిస్తే భాజపా అధిష్టానం తెలంగాణా రాష్ట్రంలో పార్టీల రాజకీయ బలాబలాలను, వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొనట్లే ఉంది. 

అయితే అవినీతి పెరిగిపోయినప్పుడు ఎంత గొప్ప జాతీయ పార్టీకయినా ఓటమి తప్పదని 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమితో నిరూపితమైంది. అప్పటి నుంచి నిన్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల వరకు వరుసగా జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికలలో అది నిరూపించబడుతూనే ఉంది. ఒకప్పుడు కర్నాటకలో భాజపా సుమారు రెండు దశాబ్దాలపాటు రాజ్యం ఏలింది కానీ అవినీతి కారణంగానే అధికారం కోల్పోయింది. అయితే ఏ అవినీతిపరుడి కారణంగా అది కర్ణాటకలో అధికారం కోల్పోయిందో, మళ్ళీ అదే అవినీతిపరుడు ఎడ్యూరప్ప చేతికే పార్టీ పగ్గాలు అప్పగించి, వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించి మళ్ళీ అధికారం సంపాదించిపెట్టే భాద్యతను ఆయనకే అప్పగించింది. ఈ 42 నెలలలో మోడీ సర్కార్ పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని భాజపా నేతలు అందరూ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, కర్నాటకలో అధికారం చేజిక్కించుకోవడం కోసం అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్ళివచ్చిన ఎడ్యూరప్పను నమ్ముకోవడం విడ్డూరంగానే ఉంది కదా?

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయననే ముఖ్యమంత్రిఅభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళడం వలన కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పునే, వచ్చే ఎన్నికలలో కర్నాటక రాష్ట్రంలో భాజపా చేయడానికి సిద్దం అవుతుండటం విశేషం. కనుక ఫలితం కూడా అదేవిధంగా ఉండవచ్చు.


Related Post