సంక్రాంతి తరువాత ముహూర్తం ఫిక్స్

December 19, 2017


img

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం డిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. వచ్చే నెల సంక్రాంతి పండుగ తరువాత తెరాస, తెదేపా, భాజపాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నేతలు తరలిరాబోతున్నారని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేస్తున్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ చార్జి రామచంద్ర కుంతియా కూడా పక్కనే ఉన్నారు. అంటే దానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముద్ర కూడా ఉందని భావించవచ్చు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత అయన చడీచప్పుడు చేయకుండా రాష్ట్రంలో పర్యటిస్తూ తెదేపా, తెరాస పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశః అయన ప్రయత్నాలు ఫలిస్తున్నందునే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. 

సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుంనందున పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమే. అయితే అందుకు ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆకర్షించడమే సరైనపద్ధతి అనుకోవడమే విచిత్రం. ఇటువంటి ఆలోచనను అమలుచేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసినందుకు తెరాసను తప్పుపడుతున్న ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు దాని మార్గంలోనే నడుస్తుండటం విడ్డూరంగా ఉంది. 

ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలకు కార్యకర్తలను తయారుచేసుకొని వారిలో నుంచి నాయకులను తయారు చేసుకొనే ఓపిక లేకుండాపోయింది. అందుకే ‘ఇన్స్టాంట్ కాఫీ’ పద్దతిలో ఇతర పార్టీలో రాటుతేలిన నాయకులను, కార్యకర్తలను దిగుమతి చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ‘ఇన్స్టాంట్’ గా పార్టీలను బలోపేతం చేసుకోవాలనుకొంటున్నాయి. 

కనుక ఒకప్పుడు వద్దనుకొన్న వేరే పార్టీ నాయకులకే వారు పార్టీ మారినప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించవలసి వస్తోంది. ఒకవేళ వారు అవినీతిపరులు, అసమర్ధులని తెలిసి ఉన్నప్పటికీ వారి పార్టీ మొహం చూసి అయిష్టంగానే వారిని గెలిపించవలసివస్తోంది. అంటే ఒక అభ్యర్ధి శక్తి సామార్ధ్యాలు, నీతి నిజాయితీ, ప్రజలకు సేవ చేసే గుణం వంటి లక్షణాలు కాకుండా పార్టీ అధినేత మొహం, ఆ పార్టీ జెండాలను చూసి ఓట్లేయవలసివస్తోందన్న మాట! కనుక రాజకీయ నాయకులు అందరూ కలిసి ప్రతీ ఎన్నికలలో ప్రజలను ఓడిస్తున్నారని చెప్పుకోకతప్పదు.  


Related Post