కేటిఆర్ అందుకు అన్ని విధాల అర్హుడే!

December 19, 2017


img

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘బిజినెస్‌ వరల్డ్‌’ ఏటా వ్యాపార, పరిశ్రమల రంగంలో కృషి చేస్తున్న ప్రముఖులకు అవార్డులిస్తుంటుంది. ఈసారి తెలంగాణా రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కేటిఆర్ కి, ప్రతిష్టాత్మకమైన ‘లీడర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ప్రకటించింది. 

సమైక్య రాష్ట్రంలో అనేక పెద్దపెద్ద పరిశ్రమలు, ప్రతిష్టాత్మకమైన సంస్థలు వచ్చిన మాట వాస్తవమే. అయితే వాటిలో చాలా వరకు కేవలం హైదరాబాద్ కే పరిమితం అవడంతో అభివృద్ధి వికేంద్రీకరణ కాలేదు. ఆ కారణంగానే తెలంగాణా ఏర్పడేనాటికి అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణా జిల్లాలలో ఎక్కడా పారిశ్రామికాభివృద్ధి జరుగలేదు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టి కరీంనగర్, భూపాలపల్లి, సిరిసిల్లా, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సిద్ధిపేట, యాదాద్రి, ఖమ్మం, నల్లగొండ, వంటి అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. వాటిని అయన కుమారుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కేటిఆర్ అత్యద్భుతంగా అమలుచేసి చూపిస్తున్నారు. 

దేశావిదేశాలు పర్యటించి రాష్ట్రంలో ఐటి, వ్యాపార సంస్థలు, ఫార్మా పరికరాల తయారీ సంస్థలు, టెక్స్ టైల్ పరిశ్రమ, నిర్మాణ రంగంలో వ్యర్ధాల రీసైకిలింగ్ ప్లాంట్, మౌలికవసతుల కల్పనకు ఉపయోగించే యంత్ర పరికరాల తయారీ పార్క్ ఇంకా అనేక రకాల చిన్నాపెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడానికి చాలా చక్కగా కృషి చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార వేత్తలను ప్రోత్సహించడానికి ఇంక్యూబేటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనదే. అలాగే డిల్లీ వెళ్ళి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేంద్రాన్ని ఒప్పించారు. ఈవిధంగా గత ఆరేడు దశాబ్దాలలో జరుగనంత వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి ఈ 42 నెలలలోనే బలమైన పునాదులు వేసిన ఘనత ఖచ్చితంగా మంత్రి కేటిఆర్ దే. కనుక ప్రతిష్టాత్మకమైన ఈ ‘లీడర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మంత్రి కేటిఆర్ అన్నివిధాల అర్హుడేనని చెప్పవచ్చు. 

ఈ సందర్భంగా అనేకమంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారిలో మోహన్ బాబు, మంచు విష్ణు, వెన్నెల కిషోర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, నాగార్జున, కోన వెంకట్, సానియా మీర్జా, అసదుద్దీన్ ఒవైసీ, ఇంకా వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.     



Related Post