టీం రాహుల్ వ్యూహాలు ఫలిస్తున్నాయా?

December 18, 2017


img

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఓటములు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి చాలా ఇబ్బందికరమైనవే. అవినీతి, అసమర్ధత, అలసత్వం కారణంగానే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకొందని అందరికీ తెలుసు. కానీ ఆ ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గుణపాఠం నేర్చుకోకపోవడం వలననే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో మళ్ళీ ఓడిపోయిందని చెప్పవచ్చు. 

ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పైనే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు, కాంగ్రెస్ అధిష్టానం సకాలంలో తగిన విధంగా స్పందించలేదు..పైగా ఈ ఎన్నికలలో కూడా ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పెట్టుకొని ముందుకు వెళ్ళి బోల్తా పడింది. కాంగ్రెస్ పార్టీకి ‘లౌకిక పార్టీ’ అనే బలమైన ముద్ర ఉన్నట్లుగానే, కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరనే చెడ్డపేరు కూడా అంతే బలంగా ఉంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం దానిని అంగీకరించడం లేదు అందుకే తరచూ ఓటమి పాలవుతోంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన పంధాను మార్చుకోకుండా దానికి బాగా అలవాటైన ‘మూస రాజకీయాలు’ చేసి ఎన్నికలలో బోల్తా పడుతోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో అవినీతి కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీకి చెంపదెబ్బవంటిదని చెప్పవచ్చు.

ఇక గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ, భాజపా కంచుకోటలో 80 సీట్లు సాధించడం విజయంతో సరిసమానమేనని చెప్పవచ్చు. అంటే టీం రాహుల్ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం అవుతోంది. ఉదాహరణకు బిహార్ ఎన్నికలలో చేసిన ‘మహా కూటమి ప్రయోగం’ విజయవంతం అయ్యింది. ఇప్పుడు గుజరాత్ లో పటేల్ కులస్థులను ఆకర్షించడం ద్వారా మంచి ఫలితాలు సాధించింది. అలాగే వచ్చే ఎన్నికల కోసం అప్పుడే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక వ్యూహాలను సిద్దం చేసుకొని ముందుకు సాగుతోంది. అదేవిధంగా ఆంధ్రాతో సహా వివిధ రాష్ట్రాలలో ఇదేవిధంగా వేర్వేరు వ్యూహాలను అమలుచేసి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేస్తే భాజపాకు, అధికార పార్టీలకే నష్టం అని చెప్పవచ్చు.

ఇక గుజరాత్ ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మణిశంకర్ అయ్యర్ వాగుడు, ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతున్నప్పుడు హార్దిక్ పటేల్ రాసలీలలు బయటపడటం, మోడీ తల్లి గురించి అతను అనుచితంగా మాట్లాడటం వంటివి కాంగ్రెస్ కు చాలా నష్టం కలిగించాయని చెప్పవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోడీ తన బలమైన వాదనలతో, రాహుల్, హార్దిక్ పటేల్ ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగించేలా చేసి వారిరువురి విశ్వసనీయతను దెబ్బతీసాయని చెప్పవచ్చు. అయితే ఆ హార్దిక్ పటేల్ కారణంగానే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి అధనపు సీట్లు సాధించిందని చెప్పక తప్పదు. ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్ పార్టీలకు అనేక కొత్త పాఠాలు నేర్పించాయని చెప్పవచ్చు. 


Related Post