పాపం ప్రతిపక్షాలు..వేరే ఏమీ దొరకలేదా?

December 18, 2017


img

హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ ‘పాతనగర మెట్రో ఐకాస’ అధ్వర్యంలో ప్రతిపక్షపార్టీలు ఆదివారం నగరంలో మీరాలంమండి నుంచి శాలిబండ వరకు మహాపాదయాత్రకు సిద్దం అయ్యారు. కానీ పోలీసులు వారి పాదయాత్రను భగ్నం చేశారు. ఈ మహా పాదయాత్రలో కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతొ పాదయాత్ర చేయలేకపోయారు. 

ఈ పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాజపా మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ, టీ-మాస్ నేతలు ఇక్బాల్‌ జావిద్, కనకయ్య, అబ్దుల్ సత్తార్, తెదేపా నేతలు సల్లారాజ్‌కుమార్‌, శ్రీకాంత్‌, నాగు నాగేశ్‌ తదితరులు హాజరయ్యారు. విశేషమేమిటంటే, పాతబస్తీకి చెందిన మజ్లీస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈ పాదయాత్రలో పాల్గొనలేదు. 

నిజానికి పాతబస్తీ మీదుగా మెట్రో రైల్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం, ఎల్&టి సంస్థ కూడా కొరుకొంటున్నాయి. అయితే మెట్రో కారిడార్ నిర్మించాలంటే పాతబస్తీలో అనేక భవనా, కొన్ని ప్రాచీన కట్టడాలు అడ్డుతొలగించవలసి వస్తుంది. అందుకు మజ్లీస్ పార్టీ అభ్యంతరాలు చెపుతోంది. వాటికి నష్టం జరుగకుండా డిజైన్లలో మార్పులు చేయాలని పట్టుబడుతోంది. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమస్యలు, ఆర్ధిక పరిమితులు, ప్రాధాన్యతలు కారణంగానే పాతబస్తీలో మెట్రో పనులు ఆలస్యం అవుతున్నాయి. కనుక వాటి కోసం ప్రతిపక్షాలు ఐకాసా ఏర్పాటు చేసుకొని పాదయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. బహుశః ప్రభుత్వంపై పోరాడేందుకు వాటివద్ద బలమైన అంశమేదీ లేనందునే ఈ సమస్యను భుజానికెత్తుకొన్నట్లున్నాయి. పాతబస్తీలో మెట్రో రైల్ కావాలని గట్టిగా కోరుకొంటే, మజ్లీస్ పార్టీయే రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి ఉండేది కదా? మజ్లీస్ పార్టీ అడిగితే తెరాస కాదంటుందా? అయినా పాతబస్తీలో మెట్రో కోసం ప్రతిపక్షాలు పాదయాత్ర చేయడం చాలా విడ్డూరంగా ఉంది. 


Related Post