మై తెలంగాణా..మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్..గ్రేట్!

December 16, 2017


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తన ఉనికిని చాటుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చినమాట వాస్తవం. అందుకే రాష్ట్రం గురించి వ్రాసేటప్పుడు ‘తెలంగాణా’ బదులు ‘తెలంగాణా రాష్ట్రం’ అని వ్రాయమని ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా మిత్రులను కోరిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కానీ ఈ 42 నెలలలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, విలక్షణమైన సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా ఇప్పుడు ‘తెలంగాణా’ అంటే చాలు...దానికి సంబంధించిన ఏదో ఒక గొప్ప విషయం గురించి దేశంలో ప్రతీ ఒక్కరు చెప్పేస్తున్నారు. ఈ క్రెడిట్ పూర్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్, అయన మంత్రులకు, వారి ఆశయాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేయింబవళ్ళు కృషి చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకే చెందుతుందని చెప్పకతప్పదు.   

దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు చాలా అభివృద్ధి చెందినప్పటికీ, కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం దేశంలోకెల్లా ‘మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్’ అని పేరు సంపాదించుకొని అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోందిప్పుడు అంటే అతిశయోక్తి కాదు.  

బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు ఉన్నప్పుడే దాని అందం ఇనుమడిస్తుందన్నట్లు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న బతుకమ్మ, బోనాల ఉత్సవాలు,  తాజాగా అంతర్జాతీయ సదస్సులతో రాష్ట్రం పేరు, హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తున్నాయి. 

ఇటీవల జరిగిన జిఈఎస్ సదస్సుకు ఇవంకా ట్రంప్ హాజరవడం, ఆ సదస్సుకు తెలంగాణా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరుగకుండా అద్భుతంగా నిర్వహించడంతో దేశవిదేశాలలో సైతం హైదరాబాద్ ప్రస్తావన వినిపిస్తుండటం చాలా ఆనందం కలిగించే విషయమే. అదేవిధంగా ఇటీవల జరిగిన నతుకమ్మ పండుగ, బోనాలు, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు...ఒకప్పుడు తెలంగాణాలో ఏమీ లేదనుకొన్న ‘జనాలకు’ తెలంగాణా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చూపిస్తూ, తెలంగాణా బాష, యాస, దాని గొప్పదనాన్ని రుచి చూపిస్తున్నాయని చెప్పవచ్చు. 

ఒక వాణిజ్య సదస్సు జరిగితే అప్పటికప్పుడు అక్కడే సంస్థల స్థాపనకు లేదా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవచ్చు కనుక తక్షణ ఫలితాలు (అవుట్ కమ్) కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపించవచ్చు. వాటితో పోలిస్తే ఈ ఉత్సవాలు, సదస్సులు, మహాసభల నిర్వహణ వలన ఎటువంటి తక్షణ ఫలితాలు కనబడవు కనుక ఇవి ప్రజాధనం వృధాచేయడమే అని వాదిస్తున్నవారున్నారు. 

అయితే ఒకపక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా జరుపుతూనే మరోవైపు సమాంతరంగా మన ఉనికిని, గొప్పదనాన్ని చాటుకోవడానికి ఇటువంటివి నిర్వహించడం కూడా చాలా అవసరం. మరోవిధంగా చెప్పాలంటే ఈ ప్రయత్నాలన్నీ తెలంగాణా రాష్ట్రానికి అధనపు ‘వాల్యూ యాడ్’ చేయడం వంటివని చెప్పవచ్చు. వీటి ఫలితాలు దీర్ఘకాలం నిలిచిఉంటాయి. కనుక వాటి కోసం కొంత ఖర్చు పెట్టినా తప్పు లేదు. వీటి కారణంగా తెలంగాణా రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రత్యేక గుర్తింపును గమనించినట్లయితే తెలంగాణా ప్రభుత్వం సరైన దిశలోనే అడుగులు వేస్తోందని అర్ధమవుతోంది. 


Related Post