ఆ నిబంధన విధిస్తే..నేతలకు కష్టమే!

December 11, 2017


img

రాజకీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రి, ప్రధాని వంటి హోదాలలో ఉన్నవారు ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి, రెంటిలో గెలిస్తే వాటిలో ఒకటి ఉంచుకొని రెండవదానికి రాజీనామా చేస్తుంటారు. అప్పుడు మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది. ఆవిధంగా చేయడం వలన కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. ఎన్నికల సంఘం, భద్రతాదళాలు, పోలింగ్ అధికారులకు, ఓటర్లకు అందరూ మళ్ళీ శ్రమపడవలసి వస్తుంటుంది. ఒక రాజకీయ నాయకుడి స్వార్ధం కోసం ప్రజాధనం వృధాచేయడం, ఇంతమంది శ్రమపడటం అవసరమా? అని ఎవరూ నిలదీయకపోగా అందరూ అది సాధారణమైన విషయంగానే పరిగణిస్తుండటం వలన దశాబ్దాలుగా దేశప్రజలు దానికి మూల్యం చెల్లించుకొంటూనే ఉన్నారు. 

ఒక రాజకీయ నాయకుడు కేవలం ఒక చోట నుంచే పోటీ చేసేవిధంగా నిబంధన విధిస్తూ చట్ట సవరణ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం దాఖలైంది. ఎన్నికల కమీషన్ కూడా దానితో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. దీని కోసం చట్ట సవరణ చేయవలసిందిగా కోరుతూ  తాము కేంద్రానికి రెండు లేఖలు వ్రాశామని కానీ కేంద్రం స్పందించలేదని ఎన్నికల కమీషన్ సుప్రీం కోర్టుకు చెప్పింది. కనుక ఈ ప్రతిపాదనపై అభిప్రాయం తెలుపవలసిందిగా కోరుతూ సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసు పంపించింది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించి పార్లమెంటులో చట్టసవరణకు సిద్దపడితే, దశాబ్దాలుగా సాగుతున్న ఈ వృధాఖర్చుకు, దుస్సంప్రదాయానికి ముగింపు వస్తుంది. కానీ ఎన్నికల కమీషన్ వ్రాసిన లేఖలకు కేంద్రం స్పందించలేదంటే దానికి ఈ ప్రతిపాదన ఇష్టం లేదనే భావించాల్సి ఉంటుంది. 


Related Post