ఓటమి భయంతోనే మోడీ ఆవిధంగా మాట్లాడారా?

December 11, 2017


img

సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించి, తన హయంలో జరుగుతున్న అభివృద్ధి, సంస్కరణల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ మొదటిసారిగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పద్దతిలో బేలతనం ప్రదర్శిస్తూ మాట్లాడి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించడం విస్మయం కలిగిస్తుంది. కాంగ్రెస్ నేతలు తనను ఎవరెవరు ఎన్ని రకాలుగా దూషించారో మోడీ చెప్పుకొన్నారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ తనను అడ్డు తొలగించుకొనేందుకు పాకిస్తాన్ తో చేతులు కలిపిందని, గుజరాత్ ఎన్నికలలో పాక్ జోక్యం చేసుకొంటోందని ఆరోపించారు. 

“నేను ఏమి పాపం చేశానని నన్ను కాంగ్రెస్ పార్టీ అడ్డుతొలగించుకోవాలనుకొంటోంది? నేను దేశాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా? నేరమా? అదే తప్పయితే నేను దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దం,” అంటూ ప్రజల సానుభూతిని పొందేమాటలు చాలా మాట్లాడారు. 

అయితే మోడీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ, పాక్ ప్రభుత్వం కూడా తిరస్కరించాయి. అయన ఓటమి భయంతోనే ఆవిధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికల కోసం ఆవిధంగా మాట్లాడి ప్రధాని హోదాను దిగజార్చవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న పటేల్ కులస్థుల యువనేత హార్దిక్ పటేల్ కూడా మోడీ ఆరోపణలను ఎద్దేవా చేశారు. “ఈసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి ఖాయం అని ప్రధాని మోడీ గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఇటువంటి అర్ధంపర్ధం, పస లేని మాటలు మాట్లాడుతున్నారు,” అని అన్నారు.   

కాంగ్రెస్ పార్టీ పాక్ తొ చేతులు కలిపి మోడీని అంతమొందించడానికి కుట్ర పన్నడం, గుజరాత్ ఎన్నికలలో పాక్ జోక్యం చేసుకొంటోందనే మోడీ ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అర్ధం అవుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు, హార్దిక్ పటేల్ వాదిస్తున్నట్లుగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో భాజపాకు ఓటమి ఖాయమని గ్రహించినందునే మోడీ ఈ ఆఖరి ఆయుధాన్ని ప్రయోగించినట్లున్నారు. ఈ నెల 18న ఎన్నికల ఫలితాలు వస్తే, మోడీ ప్రదర్శించిన ఈ చిన్న ట్రిక్కు పనిచేసిందో లేదో తేలిపోతుంది.  


Related Post